జాతీయ పార్టీలతో అభివృద్ధి 70ఏళ్లుగా జరగలేదు : KTR

వరంగల్ రూరల్ : నర్సంపేటలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ కు లాభం.. బీజేపీ గెలిస్తే మోడీకి లాభం.. కానీ టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని చెప్పారు కేటీఆర్. ఢిల్లీకి గులాంలుగా ఉండేవాళ్లను గెలిపించొద్దని కోరారు. ఢిల్లీని శాసించేవారికే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.  16 మంది టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తే…. మరో 150 మంది ఢిల్లీలో మనతో కూటమి కడతారని అన్నారు. కేంద్రం మెడలు వంచి.. నిధులు తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు.

జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నదే నిజమైతే… ఈ 70 ఏళ్లలో ఎందుకు అది జరగలేదని ప్రశ్నించారు కేటీఆర్. రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే అన్నారు. మన రాష్ట్రం బాగుపడాలంటే గులాబీ జెండా పార్లమెంట్ లో ఎగరాలన్నారు.

“రూ.80 వేల కోట్లతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరితే ఇవ్వలేదు.  నీతి ఆయోగ్ సిఫార్సు చేసి రూ.24 వేల కోట్లు మిషన్ కాకతీయ,  భగీరథ కోసం ఇవ్వమంటే.. మోడీ 24 పైసలు కూడా ఇవ్వలేదు. మన వాళ్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడి ఇవన్నీ సాధిస్తారు. మందిరాలు, మసీదులు, మతాల పేరిట ప్రజలను  విభజించే వారిని నమ్మొద్దు. చౌకీదార్, టేకేదార్లు మనకొద్దు. కేసీఆర్ లాంటి దిల్ దార్ జిమ్మేదార్ లాంటి నేత కావాలి. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం. మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితను అఖండ మెజార్టీతో గెలిపించండి” అని కేటీఆర్ అన్నారు.