వరంగల్ కు కంపెనీలు క్యూ కడుతున్నయ్ 

హనుమకొండ, వరంగల్, వెలుగు: ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ పట్టణాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని, రాబోయే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర మున్సిపల్​, ఐటీ మంత్రి కేటీఆర్​వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు ఇప్పటికే కంపెనీలు క్యూ కడుతున్నాయని, వచ్చే 18 నెలల్లో.. 20 ఫ్యాక్టరీలు ఓపెన్ చేసి.. 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపిస్తామని చెప్పారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం చింతల్​పల్లిలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్​పార్కులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్​లతో కలిసి కైటెక్స్​ కంపెనీకి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం గణేశా ఎకోపెట్​ కంపెనీని ప్రారంభించారు. చలివాగు నుంచి టెక్స్​ టైల్ పార్కు వరకు నీటిని అందించే మిషన్​భగీరథ వర్క్స్​కు శంకుస్థాపన చేశారు.

దేశంలోనే పెద్దది..

రాష్ట్రంలో పత్తి పండించే రైతులు లక్షల్లో ఉన్నారని, ఇక్కడ పండే పత్తి దేశంలోనే అత్యుత్తమమైందని మంత్రి అన్నారు. నాటి అజాంజాహి మిల్ మూతపడడంతో ఇక్కడి నేత కార్మికులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని, అలాంటి వారందరినీ వెనక్కి తీసుకొచ్చేలా వరంగల్​లో టెక్స్​ టైల్ పార్క్​ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. దాదాపు 1300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. పిల్లల దుస్తులకు సంబంధించి ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సంస్థ అయిన కైటెక్స్​ రూ.1600 కోట్లతో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోందని, దాని ద్వారా 15వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కొరియాకు చెందిన యంగ్​ వన్ అనే సంస్థ 1100 కోట్ల పెట్టుబడితో కంపెనీ స్టార్ట్​చేస్తోందని, దాని ద్వారా 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రెండు కంపెనీలు మెగా టెక్స్​ టైల్​ పార్కులో 8 నుంచి 11 ఫ్యాక్టరీలు పెట్టబోతున్నాయన్నారు. హైదరాబాద్ తరహాలో కాలేజీలు, యువత, టాలెంటెడ్​ వర్క్​ఫోర్స్​, ఇతర అన్ని హంగులున్న నగరం వరంగల్​మాత్రమేనని, అందుకే ఇక్కడ  పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పారు. ఐటీ పరంగా మైండ్​ ట్రీ, జెన్ పాక్​, సైయెంట్, టెక్​ మహీంద్రా, క్వాడ్రంట్, సాఫ్ట్​ పాత్​ కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సాఫ్ట్​ పాత్​ కంపెనీ ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

తొందర్లోనే రైతులకు ప్లాట్లు..

కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు  రైతులు 1300 ఎకరాలు ఇచ్చారని, ఇలాంటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతుల త్యాగం వెలకట్టలేనిదని మంత్రి కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి వంద గజాల ప్లాట్ ఇవ్వాల్సి ఉందని, తొందర్లోనే లేఅవుట్ కంప్లీట్​చేసి భూనిర్వాసితులందరికీ ప్లాట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు.

పరకాలకు అడిషనల్​ ఫండ్స్..

పరకాల నియోజకవర్గంలో దళిత కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగా దళితబంధు యూనిట్లు కూడా పెంచాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి కేటీఆర్​కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 18 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, అందులో ఇప్పటికీ సరైన తిండి లేని పేదలు ఎంతోమంది ఉన్నారన్నారు. డబుల్​బెడ్​ రూం ఇండ్లు కూడా మరిన్ని సాంక్షన్​ చేయాలని కోరారు. దీంతో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ పనుల నిమిత్తం రూ.25 కోట్లు మంజూరు చేశామని, ఇంకో రూ.10 కోట్లు అదనంగా ఇచ్చి అన్ని పనులు కంప్లీట్​ చేసే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు.

ఎయిర్​పోర్టుకు ఇంకా ల్యాండ్​ అవసరం

పరకాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్​ మామునూరు ఎయిర్​ పోర్ట్​ను  స్థానిక లీడర్లతో కలిసి సందర్శించారు.  ఏఏఐ ఆఫీసర్లతో చర్చించారు. ఎయిర్​ పోర్టు రన్​వే మరింత పెంచాల్సిన అవసరం ఉందని, 1.8 కి.మీల రన్​ వేను 3.9 కి.మీ.పెంచాల్సి ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్టును డెవలప్​చేయాల్సిందిగా కేసీఆర్​ సూచించారని, ఈ మేరకు రైతులతో చర్చించి భూసేకరణ చేస్తామని చెప్పారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మామునూరు పోలీస్​ ట్రైనింగ్​ కాలేజ్​లో నిర్వహిస్తున్న  ఫ్రీ కోచింగ్​సెంటర్​ను విజిట్​ చేశారు. అనంతరం కుడా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్​ విషయమై మంత్రి కేటీఆర్​స్పందిస్తూ.. ల్యాండ్​ పూలింగ్​ వల్ల రైతులకే మేలు జరుగుతుందని చెప్పారు. రైతుల అంగీకారం మేరకే భూసేకరణ చేపడుతామని హామీ ఇచ్చారు. తరువాత సాఫ్ట్​పాత్​ సిస్టం ఫస్ట్​ యానివర్సిరీకి అటెండ్​అయ్యారు. మంత్రి కేటీఆర్​ వెంట చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​, ఎంపీలు పసునూరి దయాకర్​, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్​, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్​, అరూరి రమేశ్​, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్​ నగర మేయర్​ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్లు సుధీర్​ కుమార్​, గండ్ర జ్యోతి తదితరులున్నారు.

కరెంట్ గురించి మాట్లాడుతుంటే కరెంట్ కట్

రాష్ట్రం ఏర్పడిన తరువాత కరెంట్ కష్టాలు లేకుండా చేశామంటూ మంత్రి కేటీఆర్​టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును పొగుడుతుండగా... ఒక్కసారిగా పవర్​ కట్ అయ్యింది. దాదాపు మూడు నిమిషాలపాటు మంత్రి కేటీఆర్​మైకు పట్టుకుని స్టేజీ మీదనే నిలబడాల్సి వచ్చింది. కొద్దిసేపటికి కరెంట్ వచ్చినా.. మీటింగ్​ చివర్లో కూడా మళ్లీ పవర్​ కట్​ అయ్యింది. 

భూబాధితుల అరెస్ట్​..

మంత్రి కేటీఆర్​ పర్యటన నేపథ్యంలో టెక్స్​ టైల్​ పార్కు కోసం భూములు ఇచ్చిన చింతల్​పల్లికి చెందిన రైతులు, కొంతమంది కాంగ్రెస్​, బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మంత్రి టూర్​ కంప్లీట్​ అయ్యే వరకు గీసుగొండ స్టేషన్​లోనే ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెక్స్​ టైల్​ పార్కు కోసం రైతులను మోసం చేసి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఎకరానికి వంద గజాల స్థలం, ఇంటికో ఉద్యోగం, డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇస్తామని చెప్పి.. ఇంతవరకు ఆ హామీలను నెరవేర్చలేదని 
మండిపడ్డారు.

వయసు పరిమితి పెంచాలి..

పోలీసు ఉద్యోగాల భర్తీకి వయసు పరిమితి​పెంచాలని నిరుద్యోగులు డిమాండ్​ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్​కు విన్నవించేందుకు టెక్స్​ టైల్​ పార్కుకు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తప్పించారు. మధ్యాహ్నం మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో ప్రెస్​ మీట్​కు కేటీఆర్​ వస్తున్నారని తెలుసుకుని, అక్కడికి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేసినా.. అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో వారూ సైలెంట్​గా బయటకు వచ్చేశారు. పోలీసుల తీరుపట్ల నిరుద్యోగులు మండిపడ్డారు.