రేవంత్ అంటే భయమా? ప్రజలంటే అలుసా?

రేవంత్ అంటే భయమా? ప్రజలంటే అలుసా?

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను  అసెంబ్లీకి రావొద్దని  నేనే చెప్పాను.  మిగతా ఎమ్మెల్యేలంతా  కేసీఆర్‌‌‌‌ను  అసెంబ్లీకి  రావొద్దని  చెప్పారు. రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. రేవంత్‌‌‌‌ రెడ్డి నీచమైన భాష వినడానికి, వచ్చి అవమానపడటానికి కేసీఆర్ రావాలా?’  అని బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక టీవీ చానల్​తో అన్నారు.  ‘ఎన్టీఆర్ ఐదేండ్లు అసెంబ్లీకి రాలేదు. జయలలిత  ఐదేండ్లు అసెంబ్లీకి పోలేదు.  అయినాసరే,  వాళ్ల ప్రభావం ఏమీ తగ్గలేదు.  మళ్లీ కేసీఆర్‌‌‌‌ ను  తెలంగాణ సీఎంగా చూడటమే మా లక్ష్యం’ అని కూడా  కేటీఆర్  అన్నారు.

తన తండ్రి, ప్రధాన  ప్రతిపక్ష నాయకుడు  కేసీఆర్ అసెంబ్లీకి  రావొద్దనడానికి కేటీఆర్  చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రజలకుకన్విన్సింగ్​గా  లేవు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీటులో ఉండడం మొదటినుంచీ  కేసీఆర్ కు, ఆయన పార్టీకి ఇష్టం లేదు.  మనమిక్కడ చర్చించవలసింది  కేసీఆర్ ఇష్టాయిష్టాల గురించి కాదు. ప్రజల ఇష్టాయిష్టాల గురించి చర్చించాలి. 

 బీఆర్ఎస్​ను  ప్రజలు ఎందుకు తిరస్కరించారో  ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఆ పార్టీ ఇప్పటికీ సిద్ధంగా లేదు.  ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.  ప్రతిపక్షంలో  కూర్చోవాలని తాము తీర్పు ఇచ్చినా ఇంకా బీఆర్​ఎస్​ నేతలు అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారని,  రేవంత్​ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని  ప్రజలు చర్చించుకుంటున్నారు.  కేటీఆర్  మాటల్లోని ఉద్దేశం చూస్తే రేవంత్ రెడ్డి అంటే కోపం, భయం ఉన్నట్టు కనిపిస్తోంది.

 ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ అసెంబ్లీకి రాబోవడం లేదని కేటీఆర్ తేల్చి పారేశారు. ఇక్కడ రెండు విషయాలు కీలకమైనవి. ఒకటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావలసినవసరం లేదన్నది. రెండోది అసెంబ్లీకి వస్తే కేసీఆర్ అవమానాలకు గురవుతారన్నది. ఈ రెండు అంశాలు ప్రజలకు రుచించవు.   

తమ సమస్యలపై శాసనసభా వేదిక మీదుగా కేసీఆర్ పోరాడతారని భావిస్తుండగా ఆయన ఫామ్​హౌస్​లో విశ్రాంతి తీసుకోవడమేమిటి?  అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే పదేండ్లపాలనపై కడిగేయాలని  సీఎం రేవంత్ రెడ్డి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి వేదిక నుంచి కేసీఆర్‌‌‌‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. కానీ, కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవు. 

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

‘కేసీఆర్  25 ఏండ్లుగా  తెలంగాణ  ప్రజలకు సేవలందిస్తున్నారు. అంతకుముందు 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి మహానాయకుడిని నోటికి ఎంతొస్తే అంత అన్నట్టు దూషిస్తున్నారు. ఆయన నాకు  తండ్రి. ఆయనను ఇష్టమున్నట్టు తిడుతుంటే ఎలా ఊరుకోవాలి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓ తండ్రి,  కొడుకు,  కూతురు,  మేనల్లునితో  నడుస్తున్న  బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కూడా కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకోవడం లేదు.  అధికారంలో లేకపోతే తమ రాజ్యమే కూలిపోయిందన్న భావనతో  బీఆర్ఎస్ నాయకత్వం కుమిలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 

Also Read : రెండో రాజధాని దిశగా అడుగులు పడుతున్నయా?

మధ్యయుగాల చక్రవర్తులలాగ  బీఆర్ఎస్  నాయకులు ప్రవర్తిస్తున్నారు అని సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.  నిజానికి  ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న లాజిక్కును  కేసీఆర్  మిస్సయ్యారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  294 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు  పట్టుమని 25 మంది కూడా కాంగ్రెస్ సభ్యులు లేనప్పుడు పి.జనార్దన్​రెడ్డి  ప్రతిపక్ష నాయకుని పాత్రను సమర్థంగా నడిపారు.

65కు పెరిగిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేల సంఖ్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు కేసీఆర్ అప్రతిహతంగా పాలించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పనిచేసింది. 2018లో  గెలిచిన వారిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను కేసీఆర్ ఎట్లా పార్టీలో విలీనం చేసుకున్నారో  తెలంగాణ సమాజానికి తెలుసు.  అయినాసరే,  అయిదుగురు శాసనసభ్యులతోనే  ప్రస్తుత  ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి  విక్రమార్క సీఎల్పీని  నడిపించారు.  

డాక్టర్  వైఎస్ రాజశేఖరరెడ్డి,  పీజేఆర్, భట్టి వంటి వారంతా  ఎమ్మెల్యేల సంఖ్య  ప్రాతిపదికన కాకుండా,  ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా  పోషించారు.  2021 నాటికి  టీపీసీసీ అధ్యక్షుడిగా  రేవంత్ రెడ్డి బాధ్యతలు  చేపట్టిన  తర్వాత  రాజకీయ సమీకరణలు మారాయి.   బలాబలాల్లో మార్పు వచ్చింది.  5 మంది ఎమ్మెల్యేల నుంచి 65 మంది దాకా కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు పెరగడం, అధికారంలోకి రావడం  బీఆర్ఎస్​కు ఇప్పటికీ మింగుడుపడడం లేదు.  పైగా  తాము  శత్రువుగా  పరిగణించిన వ్యక్తే  సీఎం కావడం వారికి  సహించరాకుండా ఉన్నది. 

కేసీఆర్​, కేటీఆర్ శైలిపై వ్యతిరేకత

ఓటమిపాలైతే కుంగిపోయి  ప్రజలకు దూరంగా వెళ్లిపోవడం,  ఫార్మ్ హౌస్​నుంచి రాజకీయ కార్యకలాపాలు నడపడం  నలభై  ఏండ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉండి, ఎమ్మెల్యే, మంత్రి,  డిప్యూటీ  స్పీకర్,  కేంద్రమంత్రి, ఎంపీ,  ముఖ్యమంత్రిగా కూడా పదవులు నిర్వహించిన  కేసీఆర్  అసెంబ్లీ  సమావేశాలకు గైర్హాజరు కావడం ఆయన స్థాయికి తగిన నిర్ణయం కాదని మేధావులు అంటున్నారు.   

కేసీఆర్ ను అసెంబ్లీకి రావలసిందిగా సీఎం రేవంత్​ విజ్ఞప్తి చేయడాన్ని కవ్వింపు చర్యగా  ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు.  కానీ,  సాధారణ ప్రజల్లో కేసీఆర్,  కేటీఆర్  వ్యవహారశైలి పట్ల వ్యతిరేకత  కనబడుతోంది.  ప్రజలు కేసీఆర్ పాలన మిస్సవుతున్నారు అంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై  ప్రజల్లో స్పందన రావడం లేదు.  కాగా,  ఇంతకుముందు  రాజీవ్ గాంధీ,  తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ వైఖరి  వివాదాస్పదంగా ఉన్నది.  తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ పార్టీ  హెడ్ క్వార్టర్  తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్ ప్రతిష్టించింది.  

పాత సెక్రెటేరియెట్ లో గానీ,   బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో గానీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు  కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించకపోవడం  బీఆర్ఎస్​ను  డిఫెన్సులో  పడేస్తున్నది.   దీన్ని సీఎం రేవంత్ తనకు అనుకూలంగా మలచుకున్నారు.   కేసీఆర్  పార్టీ  తెలంగాణ అస్తిత్వాన్ని క్రమంగా తుడిచిపెట్టేందుకు ప్రణాళికలు అమలుచేసినట్టు ఆరోపణలున్నవి.  అధికారం కోల్పోయి ఏడాది గడిచినా తాము చెప్పినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని, తమ ఆదేశాలనే అధికారులు పాటించాలనే ధోరణిలో  బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తుండడం విమర్శలపాలవుతోంది.

- ఎస్.కే. జకీర్,సీనియర్ జర్నలిస్ట్-