అత్యవసర విచారణ చేపట్టలేం .. కేటీఆర్​ పిటిషన్​పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా– ఈ- రేస్​ అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్​ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో గురువారం కేటీఆర్ అడ్వకేట్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందే చెప్పినట్లు విచారణను ఈ నెల 15ననే చేపడతామని తేల్చిచెప్పింది. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​ను ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అదే రోజు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మొత్తం 430 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. తమ క్వాష్  పిటిషన్ పై హైకోర్టులో రిలీఫ్ దక్కలేదని.. 

అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఈ పిటిషన్ ను దాఖలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును రద్దు చేసేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్​లో కేటీఆర్​ కోరారు. ఈ కేసు విచారణ  తేదీని ఈ నెల 15కు జాబితాలో  చేర్చగా.. అత్యవసరంగా విచారించాలంటూ గురువారం మరోసారి కేటీఆర్ తరఫు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ షిడ్ ఖర్, అడ్వకేట్ మోహిత్ రావు సీజేఐ బెంచ్ ముందుకు వెళ్లారు. శుక్రవారం విచారించాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే విచారణ తేదీని ఈ నెల 15కు కేటాయించామని, అప్పుడే చేపడ్తామని పేర్కొన్నారు.