- మహాధర్నాకు అనుమతిచ్చే ధైర్యం లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెగ ఒర్రుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.. అని వరంగల్, వేములవాడ సభల్లో సీఎం రేవంత్ సవాల్ విసరడంతో బుధవారం ‘ఎక్స్’లో కేటీఆర్ సెటైర్లు వేశారు.
‘‘నిమిషానికి నలభై సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తెగ ఒర్లుతున్నవ్. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిలబడే మాట దేవుడెరుగు.. కనీసం మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదుగా’’అంటూ రేవంత్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణలో టీటీడీ ఆలయాలను వేగంగా పూర్తి చేయండి..
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేటీఆర్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కరీంనగర్‌లో ఒక చోట, సిరిసిల్లలో రెండు చోట్ల గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ ఆలయాల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
రాష్ట్రంలో ఎన్నో గొప్ప ఆలయాలున్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో టీటీడీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు చెప్పారు. మరోవైపు, గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీల పేరుతో హామీ లిస్తోందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.