తెలంగాణ తల్లి రూపం మార్చడం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే కుట్ర: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలన్న  ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లిని మార్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి రూపం మార్చడం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇవాళ తెలంగాణ భవన్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి రూపం మార్పు విషయంలో ప్రభుత్వం తన  ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో నాలుగేళ్ల తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరుగుతుందని హెచ్చరించారు.

రాహుల్ గాంధీ తండ్రిని పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని అన్నారు. 2007లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సమాజం గొప్పతనానికి తెలంగాణ తల్లి నిదర్శనమని అన్నారు. ఆ తల్లిని పేదరికానికి నిదర్శనంగా రేవంత్ మార్చుతున్నారని ఆరోపించారు.  కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రూపుమాపుతామనడం ఆమోదయోగ్యం కాదన్నారు.

 ఇందిరాగాంధీ  ప్రతిష్టించిన భరతమాత విగ్రహాన్ని వాజ్ పేయి మార్చలేదని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి కురుచబుద్ది ఉన్న వ్యక్తి అని విమర్శించారు. ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి.. కేసీఆర్  పెట్టిన అంబేద్కర్ స్టాచ్యూపై ఎందుకు మాట్లాడరని అన్నారు. కొత్త సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ విజన్ కు నిదర్శనమని అన్నారు.