హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కష్టమొచ్చినప్పుడల్లా బండి సంజయ్, మరో ముగ్గురు ఎంపీలు ఆయన్ను కాపాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని తిడితే బీజేపీలోని నేతలకు కోపం వస్తుందన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నారో.. బీజేపీలో ఉన్నారో అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్నవాళ్లే ఫినిష్ అయ్యారని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్మీడియాతో మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు.
మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకుని మూసీలో స్కామ్ చేయాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్ వల్లే మూసీ పాడైపోయినట్లు సీఎం మాట్లాడుతున్నారు. మూసీ మురికికూపంగా మారడానికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కారణం కాదా? మూసీ ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు కేటాయించారు దేని కోసం? రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోతుంది. మూసీమే లూటో.. ఢిల్లీకే బాటో.. రేవంత్ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. వాళ్లకు డబ్బుల మూటలు పంపాలి’ అని ఆరోపించారు.
బాంబుల శాఖ మంత్రిగా పొంగులేటి
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అర్వింద్ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారని కేటీఆర్ఆరోపించారు. ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబుల శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయన ఇంట్లో ఈడీ రెయిడ్స్ జరిగితే నోట్ బయటకు రాలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే!. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా?. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి’ అనిఅన్నారు.