హైదరాబాద్, వెలుగు: గుండె నొప్పి వచ్చిన రైతుకు పోలీసులు ఇనుప సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం అమానవీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అది సీఎం రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. లగచర్ల దాడి ఘటనలో నిందితుడు హీర్యా నాయక్‌కు పోలీసులు బేడీలు వేసి, ఆసుపత్రికి తరలించడాన్ని ఆయన ఖండించారు.
గురువారం కేటీఆర్ హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న రైతు హీర్యా నాయక్‌కు బుధవారమే గుండె నొప్పి వచ్చినా వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపించిందని అన్నారు. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. బయటకు రానివ్వకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గురువారం ఉదయం మళ్లీ గుండెపోటు రావడంతో అతడికి బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డికి కూడా ఆరోగ్య సమస్యలున్నాయని అన్నారు.
ఖైదీల హక్కులను కాలరాస్తున్నరు
ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్‌లోనో తీసుకురావాల్సిందిపోయి బేడీలు వేసి తీసుకురావడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ఇది రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుందని పేర్కొన్నారు.