కేటీఆర్.. ముందు నీ ఆస్తుల లెక్క చెప్పి పాదయాత్ర చెయ్

కేటీఆర్.. ముందు నీ ఆస్తుల లెక్క చెప్పి  పాదయాత్ర చెయ్
  • పదేండ్లలో తెలంగాణను కేసీఆర్​ కుటుంబం నిలువు దోపిడీ చేసింది: కడియం శ్రీహరి
  • అవినీతి పెంట, బద్నాంలు వద్దనే బీఆర్ఎస్​ను వీడిన 
  • జైలుకు పోవుడు ఖాయమని కేటీఆర్​కు అర్థమైందని వ్యాఖ్య​

జనగామ, వెలుగు: కేటీఆర్ తన ఆస్తుల లెక్క చెప్పిన తర్వాతే పాదయాత్ర మొదలు పెట్టాలని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్​ చేశారు. 2014కు ముందు ఎలక్షన్​ అఫిడవిట్​లో చెప్పిన ఆస్తుల విలువ ఎంత? 2023లో చెప్పినది ఎంత అనేది బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. శనివారం జనగామ శివారులోని ఓ ఫంక్షన్​ హాల్లో డీసీసీ ప్రెసిడెంట్​ కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి అధ్యక్షతన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జరిగిన జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై బీఆర్ఎస్​ పాలన పై హాట్​ కామెంట్స్​ చేశారు. 

‘‘కేటీఆర్..​ గడిచిన పదేండ్లలో ఏమన్న వ్యాపారం చేసినవా? పరిశ్రమలు పెట్టుకున్నవా? వ్యవసాయం చేసినవా? ఎట్లొచ్చినయ్​ బిడ్డా నీకు ఇంతగనం పైసలు’’ అని కడియం ప్రశ్నించారు. ‘‘కార్​ రేసింగ్​లో కోట్లళ్ల అవినీతి జరిగిందట. ఏదో ఒక కేసులో జైలుకు పోవుడు ఖాయమని కేటీఆర్​కు అర్థమైంది. అందుకే జైలుకు పోవడానికైనా సిద్ధమని అంటున్నాడు. పదేండ్లలో తెలంగాణను కేసీఆర్​ కుటుంబం దోచుకున్నది. వందల కోట్లు, ఫాంహౌస్​లు యాడ్నించి వచ్చినయ్. గా అవినీతి పెంట, బద్నాంలు వద్దనే నేను బీఆర్​ఎస్​ పార్టీ నుంచి బయటకు వచ్చిన. అధికారం పోయి యేడాది కాక ముందే బావాబామ్మర్దులు కేటీఆర్, హరీశ్​ రావు గాయిగాయి అయితున్నరు”అని కడియం మండిపడ్డారు. 

బీఆర్ఎస్​ పాలనలో విద్యాశాఖకు నాలుగేండ్లు మంత్రిగా ఉన్న.. అప్పటి సీఎం కేసీఆర్​ కనీసం గంట టైం కూడా ఇవ్వకుండా విద్యాశాఖను భ్రష్టుపట్టించిండని ఆరోపించారు. బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, ఎంపీలు ఈటల రాజేందర్​, రఘునందర్​ రావు, బీజేపీ ఎల్పీ లీడర్​ మహేశ్వర్​ రెడ్డి కలిసి ఒక్క ప్రెస్​ మీట్​ పెట్టలేదని, ఎవరికి వారే మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం నుంచి రూ 50 వేల కోట్లు తెచ్చి మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి సాహసోపేతంగా సమగ్ర కుటంబ సర్వే చేపడుతున్నారని, ఇది దేశానికి రోల్​ మోడల్​ అని, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని తీర్మానం చేశారు.


కలెక్షన్​, కమీషన్​, ఎలక్షన్​ బీఆర్​ఎస్​ నినాదం: భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి


తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కేసీఆర్​కు ఇష్టం లేకుండేనని, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం పైకి మాత్రమేనని, కలెక్షన్.. కమీషన్​.. ఎలక్షన్​ అనేది వారి అంతర్గత ఎజెండాగా బీఆర్ఎస్​ పార్టీ పనిచేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో వారిని మించిన వారు లేరన్నారు. 

కేసీఆర్​ భిక్షతో రేవంత్​ రెడ్డి సీఎం అయ్యిండని హరీశ్​ రావు సోయితప్పి మాట్లాడుతున్నాడన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్​ సీఎం అయ్యిండన్నారు. పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనకు పది నెలల కాంగ్రెస్​ పాలనకు బేరీజు వేసి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు.