అధికారం ఉందని అసైన్​ చేసుకున్నరు... సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​ అనుచరుల భూ భాగోతం

అధికారం ఉందని  అసైన్​ చేసుకున్నరు... సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​ అనుచరుల భూ భాగోతం
  • గత ప్రభుత్వ హయాంలో 250 ఎకరాలు కబ్జా
  • నాలుగు మండలాల నుంచి ఫిర్యాదులు
  • రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ
  • బీఆర్ఎస్​ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీమంత్రి కేటీఆర్​అనుచరుల భూభాగోతాలు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. పదేండ్లపాటు అధికారంలో ఉండడంతో పవర్‌‌‌‌ను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అసైన్‌‌‌‌ చేసుకున్నారు.. నాలుగు మండలాల పరిధిలో ఏకంగా 250 ఎకరాలను కబ్జాచేశారు. ఏడాది కింద బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారం కోల్పోవడంతో అక్రమ పట్టాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఎంక్వైరీ చేస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు భూఆక్రమణలు నిజమని తేలడంతో కబ్జా కేసులు పెట్టి, జైలుకు పంపుతుండడం హాట్​టాపిక్​గా మారింది.

కేటీఆర్‌‌‌‌, చెన్నమనేని సిఫార్సులతో...

2014లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక అసైన్డ్‌‌‌‌ భూముల కేటాయింపుల కోసం కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌‌‌బాబు వ్యవహరించారు. వీరి సిఫార్సులతో కొందరు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు భూములను పట్టా చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా 250 ఎకరాల భూములు ఇలా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.. ఈ భూములను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అక్రమంగా పట్టా చేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు.

భూములు పొందిన వారిలో అర్హులు ఉన్నారా ? లేక అనర్హులకు కేటాయించారా ? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఏ ఊరిలో ఎంత భూమి కేటాయించారు ? పట్టా పొందిన వ్యక్తి ఇప్పుడు కబ్జాలో ఉన్నారా ? లేదా ?  అనే విషయాలపై రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత రిపోర్ట్‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఆందోళనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు

సిరిసిల్ల మున్సిపల్‌‌‌‌ పరిధిలోని పెద్దూర్‌‌‌‌ శివారులోని మెడికల్‌‌‌‌ కాలజీకి దగ్గర్లో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ కొంత భూమి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పట్టా చేసుకున్నట్లు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దాపూర్‌‌‌‌, చిన్నబోనాల, పెద్దబోనాల శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమి సైతం కబ్జా అయినట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌‌‌‌ గ్రామ శివారులోని 12 ఎకరాలను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన ఇద్దరు నేతలు పట్టా చేయించుకున్నట్లు తెలుస్తోంది. ముస్తాబాద్‌‌‌‌ మండలంలో అనర్హులకు రెండు ఎకరాలను కేటాయించినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో మూడు ఎకరాల అసైన్డ్‌‌‌‌ భూమిని సిరిసిల్ల పట్టణంలోని ఓ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నేత తమ్ముడు  కబ్జా చేసి నాలుగేండ్ల పాటు చిరుధాన్యాలు సాగు చేశాడు. ఆ భూమిని 20 రోజుల కింద రెవెన్యూ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. వీర్నపల్లి మండంలోని ఎర్రగడ్డ తండాలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత మూడు ఎకరాల పోడు భూమిని కొన్నాళ్లు సాగు చేసి, ఆ తర్వాత ఎస్టీలకు అమ్మినట్టు 2023లో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అయింది.

ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లో ఉన్న అసైన్డ్‌‌‌‌ భూముల అక్రమ కేటాయింపులపై రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. తాజాగా జెగ్గరాపల్లి సమీపంలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసుకున్నాడన్న ఆరోపణలతో కేటీఆర్‌‌‌‌ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్‌‌‌‌ జైలుపాలయ్యాడు. దీంతో అసైన్డ్‌‌‌‌ భూములను ఆక్రమించుకున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు ఆందోళనలో పడిపోయారు.

మెడికల్‌‌‌‌ కాలేజీకి భూములిచ్చిన వారికి మొండిచేయి

తన అనుచరులు, తమ పార్టీ లీడర్లకు ప్రభుత్వ భూములు కట్టబెట్టిన కేటీఆర్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కాలేజీకి భూములు ఇచ్చిన రైతుల మాత్రం విస్మరించారు. మెడికల్‌‌‌‌ కాలేజీ నిర్మాణానికి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్‌‌‌‌ గ్రామానికి చెందిన 50 మంది రైతులు 30 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ టైంలో వారికి భూమికి బదులు మరో చోట భూమి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మెడికల్‌‌‌‌ కాలేజీని ఆనుకుని వెంకటాపూర్‌‌‌‌ శివారు వరకు సుమారు 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. మెడికల్‌‌‌‌ కాలేజీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇక్కడి భూములు ఇచ్చే అవకాశం ఉన్నా అప్పట్లో కేటీఆర్‌‌‌‌ పట్టించుకోలేదు. 

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కానివ్వం 

జిల్లాలో ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కానివ్వం. కబ్జాకు గురైన సెంటు భూమిని కూడా వదలబోం. పేదలకు పంచాల్సిన భూమి పెద్దలు కాజేస్తే రికవరీ చేస్తాం. ప్రభుత్వ భూమిని చట్టప్రకారం అర్హులైన పేదలకు అందజేస్తాం. గతంలో అన్యాకాంతమైన భూములను ప్రభుత్వం రికవరీ చేస్తోంది.  
-  ఆది శ్రీనివాస్‌‌‌‌, ప్రభుత్వ విప్‌‌‌‌

కేటీఆర్‌‌‌‌ హామీతో మెడికల్‌‌‌‌ కాలేజీకి భూములిచ్చినం 

సిరిసిల్ల మెడికల్‌‌‌‌ కాలేజీ కోసం మా భూములను త్యాగం చేసినం. అప్పటి మంత్రి కేటీఆర్‌‌‌‌ మాకు భూమికి బదులు భూమి ఇస్తానని మాట ఇచ్చిండు. ఆయన మాట మీద మా భూములు ఇస్తే... మాకు భూమికి బదులు భూమి ఇవ్వకుండా మోసం చేసిండు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టుకున్నరు. కానీ పేదోళ్ల భూములు తీసుకుని మెడికల్‌‌‌‌ కాలేజీ నిర్మాణం పూర్తయినా మాకు భూమికి బదులు భూమి ఇవ్వలేదు.
- సలేంద్రి బాల్‌‌‌‌రాజు, రైతు, పెద్దూర్‌‌‌‌ గ్రామం