కేటీఆర్ కేసులో బిగ్ ట్విస్ట్: సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం

కేటీఆర్ కేసులో బిగ్ ట్విస్ట్: సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే ఆశ్రయించింది. ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులును కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని కేటీఆర్ తరపు న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అందరికి ‘రూల్ ఆఫ్ లా’ వర్తిస్తుందని కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు గుర్తుచేసింది.

అసలు కేటీఆర్పై నమోదైన కేసు ఏంటంటే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది.

Also Read : కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చేస్కోనియ్యండి

ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఏసీబీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తేల్చింది. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారని తేలింది.

2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3, 11వ తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌‌‌‌లోని ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌‌‌కు తరలించారు. ఇందుకు గాను ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్‌‌‌‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. ఫెడరేషన్ ఆఫ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ క్లబ్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌‌‌ఐఏ)కు రూ.1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి  మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ దుర్వియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.