2025 తర్వాతే జనంలోకి కేసీఆర్.. క్లారిటీ ఇచ్చేసిన కేటీఆర్..!

2025 తర్వాతే జనంలోకి కేసీఆర్.. క్లారిటీ ఇచ్చేసిన కేటీఆర్..!

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలో కి రావడానికి ఇంకో ఏడాదిపైనే పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే స్వయంగా వెల్లడించడం గమనార్హం. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చాలా అరుదుగా ప్రజల్లోకి వస్తున్నారు. ఫాంహౌస్‎లో ప్రమాదం జరిగి తుంటి ఎముక విరగడంతో చాలా రోజుల పాటు ఆయన మంచానికే పరిమితమయ్యారు. కాస్తా కోలుకున్న కేసీఆర్ ఫిబ్రవరి 14న జరిగిన నల్లగొండ జలగర్జన సభకు హాజరయ్యారు. కృష్ణా నీళ్లలో వాటాను తెలంగాణ వదులు కోవడంపై తనదైన శైలిలో స్పందించారు. 

ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  అతి కష్టంగా కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. తొలుత ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన స్పీకర్ చాంబర్‎లోనే ప్రమాణం చేశారు. అనంతరం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోమారు అసెంబ్లీకి వచ్చారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే సమావేశం నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లారు. తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్‎కు వెళ్లిన కేసీఆర్ మీడియా ముందుకుగానీ, అసెంబ్లీకి గానీ రాలేదు.  

జైలు నుంచి విడుదలైన బయటికి ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కనిపించడం లేదు. దీనిపై అధికార పక్షం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. కేసీఆర్ బయటికి రావాలని డిమాండ్ చేసినా ఆయన మాత్రం తొణకలేదు. దీపావళి సందర్బంగా కేటీఆర్ అసలు విషయం బయటపెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి వరకూ ఫాంహౌస్ లోనే కాలం వెళ్లదీస్తారా..? అన్నది హాట్ టాపిక్‎గా మారింది. 

ప్రతి విషయం స్టడీ చేస్తున్నారు

ట్విట్టర్ వేదికగా జరిగిన ఆస్క్ కేటీఆర్ క్యాంపెయిన్‎లో  ఓ నెటిజెన్ ‘కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు.. యాక్టివ్‎గా లేకపోవడానికి కారణలేమిటి?’అని కేటీఆర్‎ను అడగగా.. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని బదులిచ్చారు. ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారని. అన్ని విషయా పార్టీ కార్యక్రమాల విషయంలో తమకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారంటూ సమాధానం ఇచ్చారు.

 2025 తర్వాత ప్రజల్లోకి వచ్చి విస్తృతంగా పర్యటిస్తారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సమయం ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగోలేవని, ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఒకనొక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ, ప్రజల కోసం నిలబడి పోరాడుతున్నానని కేటీఆర్ అన్నారు.

తప్పేం లేదు

బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్‌ సమయం ఇవ్వడంలో తప్పేమి లేదని కేటీఆర్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయినట్లు ఓటమి గల కారణాన్ని చెప్పారు. ఎన్నికల సమయంలో తప్పు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయని అన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు. 

పాదయాత్ర చేస్త

కార్యకర్తల ఆకాంక్ష మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన కొట్లాడటం తమ బాధ్యతని చెప్పారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. అధికారంలోకి రాగానే పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.