హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నుంచి జంటనగరాల్లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆయన పర్యటన మొదలుకానుంది. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పథకాలు, నగరంలో చేసిన అభివృద్ధి అంశాలను తన పర్యటనలో వివరించే ప్రయత్నం చేయనున్నారు. పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. సభ్యత్వాల నమోదులో గ్రేటర్ పరిధిలో నేతలు వెనుకబడడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గత నెల ప్రారంభంలో మొదలైన సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ నేతలు అస్సలు శ్రద్ధ పెట్టలేదనే ఆగ్రహంతో కేటీఆర్ ఉన్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపం ఈ పరిస్థితికి కారణం అని ఆయన భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిటీలో పార్టీకి నష్టం తప్పదని భావనతో తానే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు.
జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు ?
షెడ్యూల్ ప్రకారం అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు మరో ఏడాదిన్నర తర్వాత జరగాల్సి ఉంది. అయితే ముందస్తు కూడా జరగవచ్చనినే అభిప్రాయంతో పార్టీ నాయకులు ఉన్నారు. ఇదే విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొన్ని సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉండే విధంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకే కేటీఆర్ ఇప్పటి నుంచి దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ లో టీఆర్ఎస్ ఏకంగా వంద మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ లు ఖాతా కూడా తెరవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ కలిపి 8 సీట్లు గెలుచుకుంటే గ్రేటర్ పరిధిలో 16 సీట్లు అధికారపార్టీ నిలుపుకుంది.
లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సికింద్రాబాద్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఓడిపోయింది. చేవెళ్లలోనూ బొటా బొటా మెజార్టీ తో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో సిటీలో టీఆర్ఎస్ పట్టు సడులుతుందన్న భావన సీనియర్ నేతల్లో ఏర్పడింది. దానికి అనుగుణంగానే పార్టీ సభ్యత్వాల్లో అట్టర్ ప్లాఫ్ అయ్యింది. సీనియర్ నేతలంతా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ ఈ పరిస్థితి తలెత్తడంతో కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారు.