వరంగల్: మడికొండలో సైయెంట్, టెక్ మహీంద్రా సంస్థల క్యాంపస్ లను మంగళవారం ప్రారంభించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… వరంగల్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాలని రెండేళ్ల క్రితం ఆనంద్ మహేంద్రతో మాట్లాడామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ఇప్పుడు కంపెనీ పెట్టారని చెప్పారు. ఐటీని జిల్లాలకు విస్తరించడం ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు కేటీఆర్. టెక్ మహీంద్రా, సెయింట్ కంపెనీలు కలిసి పదివేల మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైయెంట్, టెక్ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్ తో పాటు… పలువురు నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ – హైదరాబాద్ కు గంటలో ప్రయాణం చేసేలా రోడ్ల నిర్మాణం జరుగుతోందని… ఈ రోడ్ వే పారిశ్రామిక కారిడార్ గా మారనుందని తెలిపారు కేటీఆర్. జనగామ, పరకాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మహబూబాబాద్ లో ఆహార శుద్ద ప్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను బహుముఖ అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద జౌళి పార్కును వరంగల్ లో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
మామునూర్ ఎయిర్ పోర్ట్ ను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు కేటీఆర్. హెలిపోర్ట్ సర్వీసును కూడా ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలో మరో హరిత విప్లవం రాబోతుందని… కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించామని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్ తో తెలంగాణ కోటి ఇరవై లక్షల మాగాణి కాబోతోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని… ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు 12వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని… 13లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని తెలిపారు. ఈ ఏడాదిలోనే కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. వరంగల్, కరీంనగరే కాదని.. రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తామని కేటీఆర్ చెప్పారు.