గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రి కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల టూరిస్టు శాసనసభ్యుడిగా విధులను నిర్వర్తిస్తున్నాడు. గతంలో అప్పుడప్పుడు.. ఇప్పుడు తరచుగా సిరిసిల్లకు వచ్చి పరామర్శిస్తున్నాడు. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఏర్పడ్డ సంక్షోభానికి కారణం తాము కాదన్నట్టు, తమ ప్రమేయం ఏదీ లేదన్నట్టు, ప్రస్తుత ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
2014 ముందు ఇక్కడ పరిశ్రమ డిమాండ్– సప్లై ఆధారంగా అప్పుడప్పుడు చిన్న కుదుపులకు లోనైనా దాదాపుగా నల్లేరు మీద నడకలా కొనసాగింది.బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత పరిశ్రమరంగంలో కలగజేసుకొని 2017 నుంచి బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ పాఠశాల యూనిఫాం, గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు బహుమతులు, మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ తోఫాలు అందించే క్రమంలో సిరిసిల్ల నేత పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా సిరిసిల్ల నేత పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారు.కార్మికరంగం బతికే నెపం పేరున తామే సిరిసిల్ల నేత పరిశ్రమను సంరక్షించామనే ప్రచారం ఇబ్బడి ముబ్బడిగా చేసుకున్నారు. కేటీఆర్ పక్కా వ్యూహంతో సిరిసిల్ల నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే నేత కార్మికుల ఓట్లపై కన్నేసి అమలుచేశారు.
20 వేల మందికి జీవనోపాధి
నేత కార్మిక కుటుంబాలకు ఇంటింటికి 35 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేలా అంత్యోదయ రేషన్ కార్డులను జారీ చేశారు. స్త్రీలకు ఫైనాన్స్ వేధింపుల బారి నుంచి తప్పించేందుకు పావలా వడ్డీ రుణాల సౌకర్యాలను పెద్ద మొత్తంలో కలగజేశారు. అందులో భాగంగా స్త్రీ స్వయంశక్తి పొదుపు సంఘాలను ప్రోత్సహించారు. పిదప నేత పరిశ్రమ సిరిసిల్ల పట్టణంలో ఒకవిధంగా ఉన్నంతలో మంచిస్థితిలో కొనసాగిందనే చెప్పాలి. నాడు ఉన్న 30వేల పవర్లూమ్లలో 15వేల వరకు కాటన్ క్లాత్‌ను ఉత్పత్తి చేస్తే మిగతా 15 వేల పవర్లూమ్స్ పై పాలిస్టర్ ఉత్పత్తి చేసేవారు.
కాటన్ క్లాత్ పరిశ్రమకు అనుబంధంగా 120 వరకు చిన్న తరహా డైయింగ్ యూనిట్లు కొనసాగాయి. సుమారు 3000 మంది కార్మికుల వరకు ఆటోవాలాలు, రవాణా, హమాలీలు పనిచేసేవారు. నాటి 30 వేల పవర్లూమ్స్ అనుబంధ పరిశ్రమలు అన్నిట్లో కలిపి 20,000 మంది కార్మికులు బతికేవారు. ఎవరి మార్కెట్లు వారికి ఉండేవి. అటు యజమానులు ఇటు కార్మికులు బతికేవారు. నేత పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీ, ఇతర రుణ సౌకర్యాల ద్వారా తన బాధ్యతగా చేయూతను అందించింది.
వ్యూహాత్మక ఎత్తుగడ
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నేత పరిశ్రమను ఆదుకునే ఎత్తుగడతో బతుకమ్మ పండుగ చీరల తయారీ, ఆర్వీఎం యూనిఫాంల ఆర్డర్లను ఇచ్చింది. అంతవరకు స్వతంత్రంగా నడుస్తున్న నేత పరిశ్రమను, మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తెచ్చుకుంది. సిరిసిల్లలో మూడంచెల వ్యవస్థ నేత పరిశ్రమలో ఉంది. అది ఒకటి సేట్లు, రెండు ఆసాములు, మూడు కార్మికులుగా ఏర్పడ్డాయి. సేట్లు అనగా ధనవంతులు, రెండు ఆసాములు అంటే పవర్లూమ్ స్థాపించుకున్న మధ్యవర్తులు, మూడు.. పవర్లూమ్ లపై షిప్టులవారీగా పని చేసే కార్మికులు. ఈ బలమైన లంకెను గమనించిన కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో 80% పైగా పద్మశాలీలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే ఆలోచనలతో పన్నాగం పన్నాడు. అంతవరకు ఉన్న కాటన్ పరిశ్రమ క్రమక్రమంగా కొనఊపిరికి వచ్చింది.
ఇక ఒకే ఒక్క పాలిస్టర్ పరిశ్రమ మొత్తం ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి బతుకును కొనసాగించింది. దీనికి ముద్దుపేరు వర్కర్ ను ఓనర్ చేస్తామని తీయని నినాదాన్ని కేటీఆర్ తీసుకువచ్చాడు. అది ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉన్నది. ఆసాములు మ్యాక్స్ సంఘాలుగా ఏర్పడిన 140 సంఘాలను గత అధికారులతో సిరిసిల్ల పట్టణంలో తన అనుయాయులకు అప్పగించాడు. పదిమంది సరికొత్త యజమానులే మ్యాక్స్ సొసైటీని మాజీ మంత్రి అనుయాయులే తమ అధీనంలోకి తీసుకున్నారు. దీనితో సిరిసిల్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో తమ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికి సరఫరా చేసిన బతుకమ్మ చీరలకు చెల్లింపులుఎందుకు చేయలేకపోయిందో, కారణాలు ఏమిటో మాజీ మంత్రి కేటీఆరే చెప్పాలి.
23 వేల పవర్లూమ్స్
నేడు ప్రభుత్వం లెక్కల ప్రకారం 23 వేల పవర్లూమ్స్ ఉన్నాయి. సుమారు 6,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో ప్రస్తుతం ఏర్పడిన స్థితిగతులకు మూలకారణం సేట్లు పని ఇవ్వకపోవడం. ఎందుకంటే వీళ్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తేనే తిరిగి పరిశ్రమ పవర్లూమ్ లో కండె ఆడుతుందని లేకుంటే లేదని తేల్చివేశారు. పైగా 122 మంది పెద్ద కార్ఖానాలు కుటీర పరిశ్రమ పేరుతో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సేట్లు అక్రమంగా 50 శాతం విద్యుత్తు సబ్సిడీని పొందుతున్నారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఆ వినియోగదారులు మొత్తం విద్యుత్ చార్జీలను సహకార విద్యుత్ సరఫరా సంఘానికి సకాలంలో చెల్లించమని ఆదేశించింది. ఇప్పుడు పరిశ్రమను మూసివేయడానికి కరెంట్ బిల్లులు కూడా ఒక ముఖ్య కారణం అయింది.
నేత కార్మికుల ఆత్మహత్యలు
గత ఐదు దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత పరిశ్రమ మూలాలు తెలిసిన వ్యక్తిగా పరిశీలిస్తే అనేక విషయాలు కుల్లం కుల్లాగా విశదం అవుతున్నాయి. 1990వ దశకంలో సిరిసిల్లలోని ఇంటింటికీ చేనేత సహకార సంఘాల బోర్డులు మూడు, నాలుగు వేలాడుతుండేవి. అప్పుడు ప్రభుత్వం చొరవతో జిల్లా కేంద్ర వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉండి రుణాల పేరున ఆర్థిక సహాయాన్ని ఆ సంఘాలు పొందాయి. అనంతరం ఎన్టీఆర్ హయాంలో సంఘాలన్నీ బోగస్ అని విచారణలో తేలడంతో వాటిని విలీనం చేసి సుమారు 64 సంఘాలుగా ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేడీసీసీ బ్యాంక్ నుంచి సిరిసిల్ల పట్టణం చేనేత సహకార సంఘాలు పొందిన రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు 189 కోట్ల రూపాయలు పారుబాకీల కింద రద్దు చేశారు. ఇప్పుడు అదేవిధంగా సమస్య ఒకవిధంగా పునరావృతం అయిందనిపిస్తుంది. 90వ దశకంలో చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభం వలన సిరిసిల్ల లోని నేత కార్మికులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుడున్న సిరిసిల్ల శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకుపోయారు. తక్షణ పరిష్కార మార్గంగా సిరిసిల్ల నేత పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించి 5 హెచ్పీల వరకు ఉపయోగించే విద్యుత్తు చార్జీలలో 2006 సంవత్సరం నుంచి 50% రాయితీ ప్రకటించింది. తద్వారా నేత పరిశ్రమను ఆదుకున్నట్లయింది.
ప్రభుత్వం చేయూతను అందించాలి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత పరిశ్రమను తీర్చిదిద్దాలి. ఆ దిశగా సిన్సియర్ అధికారులతో పునర్నిర్మాణానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాలి. ప్రభుత్వం కాటన్ పరిశ్రమకు కూడా ఇతోధికంగా చేయూతను అందించాలి. ఇక్కడ తయారవుతున్న కాటన్ పరిశ్రమలకు మినీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయుటకు స్థలాన్ని కేటాయించి తగు ఆర్థిక సహాయాన్ని అందించాలి. పదిమంది బడా యజమానుల చేతుల్లో బంధీలుగా ఉన్న మ్యాక్స్ సొసైటీలకు విడుదల విముక్తి కలిగించాలి. దీంతో సిరిసిల్లలో కాటన్ పరిశ్రమ ఇతర ప్రాంతాలలోనున్న మార్కెట్ ను తన సొంతం చేసుకోగలదు. అంతేగాక నేరుగా ఆసాములకు యారన్ డిపో ద్వారా సబ్సిడీకి నూలు ఇచ్చి కార్మికులకు ఇంకా మెరుగైన జీవితాన్ని అందించవచ్చు. తద్వారా సిరిసిల్ల నేత పరిశ్రమకు నాణ్యమైన కాటన్ పాలిస్టర్ గుడ్డకు పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చును.
- జూకంటి జగన్నాథం, కవి, రచయిత