ఫార్ములా ఈ- కేసు.. లొట్టపీసు కేసు.. : కేటీఆర్

ఫార్ములా ఈ- కేసు.. లొట్టపీసు కేసు.. : కేటీఆర్

హైదరాబాద్: ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని న్యూ ఇయర్ సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన అన్నారు. అవినీతే లేనప్పుడు..  కేసు ఎక్కడదని, ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని కేటీఆర్ కొట్టిపారేశారు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారని, ఏసీబీ కేసులో అస్సలు పస లేదని కేటీఆర్ తీసిపారేశారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని కేటీఆర్ చెప్పారు.

పాపం.. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని, తనపై ఇది ఆరో ప్రయత్నమని, రేవంత్కు ఏమీ దొరకటం లేదని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పారు. ఒక్క పైసా కూడా అవినీతి లేదని, జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని, రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నా, వద్దనేది రేవంత్ నిర్ణయం అని వివరించారు. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదని, తనపై కేసు పెడితే.‌. రేవంత్పై కూడా కేసు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా?’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

అసలు కేటీఆర్పై నమోదైన కేసు కథాకమామిషు ఏంటంటే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో రెగ్యులర్ ఎంక్వైరీ కింద ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది.

హెచ్ఎండీఏ నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన నిధులు.. ఏ అకౌంట్స్లోకి చేరాయనేది గుర్తించి కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ని ఏ2గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొంది. ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చిఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. ఫార్ములా–ఈ రేస్ ఆపరేషన్స్కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్‌‌ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ తెలిపింది. ఆయన తన ఆధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్​ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేసింది.