సుశీ ఇన్​ఫ్రా లావాదేవీలపై కేటీఆర్ అబద్ధాలు:రఘునందన్ రావు

చౌటుప్పల్, వెలుగు: సుశీ ఇన్​ఫ్రా కంపెనీ నుంచి చౌటుప్పల్ మండలానికి చెందిన పలువురు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని పేర్లు, అకౌంట్ వివరాలతో కేటీఆర్ ఈసీకి ఫిర్యాదు చేశారని, కానీ అదంతా అసత్య ప్రచారమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలోని ఆకుల నవ్య, పబ్బు రాజు గౌడ్, పబ్బు అరుణ తో పాటు మరికొంత మంది అకౌంట్లలో అక్టోబర్14,18, 29 తేదీల్లో డబ్బులు పడ్డట్లు కేటీఆర్ చెబుతున్నారని, వారి బ్యాంక్ స్టేట్ మెంట్లను చెక్​చేసుకోవాలని చూపించారు. దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 14,18 తేదీల్లో బదిలీ అయిన డబ్బులు ఇప్పటి వరకు సదరు వ్యక్తుల ఖాతాల్లో  పడలేదని, మరి కేటీఆర్ గాలిలో దొంగిలించాడా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల లీడర్ల ఫోన్లను ట్యాప్​ చేయడమే కాకుండా సొంత పార్టీల ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్​చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానించడం వ్యక్తుల ఇష్టమని, వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు చెప్పినా, ఫోన్లు ట్యాప్​చేస్తూ, అకౌంట్లను చూస్తున్నారన్నారు. వ్యక్తుల ఖాతాలు చూడడం వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని దీనిపై ఎన్నికల తర్వాత కోర్టులో కొట్లాడుతామన్నారు. సదరు వ్యక్తులకు మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత రాత్రి ఆరెగూడెంలో బీజేపీ ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్​కార్యకర్తలు రాళ్లదాడి చేసి ఐదుగురిని గాయపరిచారని, వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.