- డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు
- బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు జరగలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డీజీపీ జితేందర్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు కాపీ అందజేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. తుంగతుర్తిలో గురువారం ధర్నా చేస్తున్న తమ పార్టీ నాయకులపై 50 మంది కాంగ్రెస్ నాయకులు రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని ఆరోపించారు.
దాడి చేస్తున్న వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు, నిరసన తెలుపుతున్న తమ నాయకుల టెంట్లను కూల్చేశారని చెప్పారు. అలాగే, కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై దాడులు జరగలేదన్నారు.
జ్వరాలు పెరుగుతున్నయ్..రివ్యూ చేసి చర్యలు తీసుకోండి
ప్రజాపాలనలో ప్రజారోగ్యం పడకేసిందని, జనాలు జ్వరాలతో పరేషాన్ అవుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిస్థితిపై వెంటనే రివ్యూ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక.. దోమల బెడద పెరిగిపోయిందని, వాటి వల్ల జనాలు డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా లాంటి జబ్బుల బారిన పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ లీజులో అవకతవకలుంటే రద్దు చేయండి
ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఓఆర్ఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు అప్పగించిందని రెవెన్యూ మంత్రి ఆరోపిస్తున్నారని, అవకతవకలు ఉంటే లీజును రద్దు చేయాలని అన్నారు.