
హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి ఆడబిడ్డలను జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమో అని అపోహ పడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలీని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉందని విమర్శలు గుప్పించారు.
డిజిటల్ మీడియా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లతో చంచల్ గూడ జైల్లో సోమవారం (మార్చి 17) కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా భావిస్తున్నారని.. దీని గురించి ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారన్నారు. 420 హామీలను ఇచ్చి తమని మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ప్రజలు తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారని అన్నారు.
ALSO READ | అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావులను కలిసిన ఎమ్మెల్సీ మల్లన్న
ముఖ్యమంత్రికి తమ బాధలు అర్థం కావడానికి ఆయన మాట్లాడే బజారు భాషలోనే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది సామాన్యులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్‌కి దుకాన్ ఇదేనా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనం నిలదీస్తే.. ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కు పాదం మోపుతారా..? జర్నలిస్టులను జైలుకు పంపుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు జర్నలిస్టులను కాదు పదుల సంఖ్యలో జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి దాడులతో వేధిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే యూట్యూబ్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నారన్నారు. 6 గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నాడని విమర్శించారు. తన భార్యా పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న రేవంత్ రెడ్డి గతంలో మా మీద అవాకులు చెవాకులు మాట్లాడిన సంగతి మర్చిపోయారా..? మా పిల్లల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్‌కు కుటుంబం గుర్తుకురాలేదా..? నువ్వు మాట్లాడితే మంచిది ఇంకొకరుమాట్లాడితే మంచిది కాదా..? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ తరుఫున జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ల కోసం న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. జైల్లో పెడతామంటే భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరని.. మేమంతా ఉద్యమాల నుంచి, జనం వచ్చిన వాళ్లమని.. కేసులకి బెదిరింపులకి భయపడే వాళ్ళంకాదన్నారు.రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే శాస్తి జరుగుతుందని.. ఇప్పుడు ఆయనకు వంతపడే వాళ్లకు కూడా ఇదే జరుగుతుందని హెచ్చరించారు.
రేవతి, తన్వి యాదవులకు జరిగిందే రేపు మిగితా జర్నలిస్టులకు కూడా జరగవచ్చని.. ప్రజల ఆక్రోశాన్ని చూపించడమే వారు చేసిన తప్పా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడన్నారు. రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని రేవంత్ రెడ్డి చెప్పాడు.. దీనికి కారణం అతడి అసమర్థ విధానాలేనని విమర్శించారు.
తాము వచ్చాక తెలంగాణ లో అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పుకున్న రేవంత్ రెడ్డి రూ.71 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో రాయిల తెలంగాణ మారిందన్నారు. జర్నలిస్టులను జైల్లో పెడతామని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. దయచేసి మీడియా గొంతు విప్పి రేవంత్ రెడ్డి అక్రమాలపై మాట్లాడాలని రిక్వెస్ట్ చేశారు.