హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మరికొందరు ముఖ్య నేతలతో కలిసి ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌తో కేటీఆర్ చర్చించినట్టు తెలిసింది. లగచర్ల ఘటనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, దానిపై పోరాటం చేయాలని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. దానితోపాటు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, శైలజ మృతిపైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించాలని చెప్పినట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రైతురుణమాఫీ, రైతు భరోసాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ చెబుతున్న ఆరు గ్యారంటీలపైనా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిసింది. అయితే, దీనిపై ఆదివారం మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కేసీఆర్‌తో ఫామ్‌హౌస్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని కేటీఆర్ చెప్పారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు.
కేసీఆర్ వస్తరా.. రారా?
అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్‌కు పదేపదే సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్ష నేతగా సమావేశాలకు హాజరై పెద్దమనిషి తనాన్ని నిలుపుకోవాలని సూచించారు. జులైలో నిర్వహించిన సమావేశాల్లో ఒక్కరోజు కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.
మాయం, మోసం..ఇదే కాంగ్రెస్ చేసింది: కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహం నమూనాపై కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. మాయం చేయడం, మోసం చేయడం తప్ప కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బయటకు రావడంతో శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం. తల్లి చేతిలో బతుకమ్మ మాయం. తల్లి కాళ్ల కడియాలు మాయం.. ఆర్టీసీ లోగోలో చార్మినార్, కాకతీయ తోరణం మాయం. రైతుల భూములు మాయం. మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం. టీఎస్‌లో ఎస్ మాయం. ఖజానాలో కాసులు మాయం. మాయం చేయడం.. మోసం చేయడం. ఇది తప్ప కాంగ్రెస్ ప్రజలకు చేసిందేంటి.. ప్రజలకు ఒరిగిందేంటి?’’ అని తన పోస్టులో పేర్కొన్నారు.