దమ్ముంటే నిరూపించు.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి సవాల్

దమ్ముంటే నిరూపించు.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి సవాల్

నేలకొండపల్లి, వెలుగు: తప్పు చేస్తే.. చిన్న దొరైనా, పెద్ద దొరైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు రాజకీయాలు చేయబోమని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం, నేలకొండపల్లి, బొదులబండ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ సర్కారు తొండాట ఆడదని అన్నారు. అమృత్ టెండర్లలో ఒక్క రూపాయి వర్క్ కూడా రాఘవ కన్​స్ట్రక్షన్స్​ తీసుకోలేదని.. దమ్ముంటే నిరూపించాలని కేటీఆర్ కు సవాల్​విసిరారు. 

తప్పుడు ఆరోపణలు చేయడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని ఫైర్​అయ్యారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతని ప్రతి మాటపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘కేబినెట్ మంత్రికి ఎలాంటి పవర్స్ ఉంటాయో తెలియని కేటీఆర్.. పదేండ్లు ఎలా పనిచేశాడో అర్థం కావడం లేదు’’అని ఎద్దేవా చేశారు. మేఘా లాంటి సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసిందో రాష్ట్ర ప్రజలంతా గమనించారని అన్నారు. తప్పు చేస్తే  ఏ కంపెనీనైనా ప్రభుత్వం బ్లాక్​ లిస్టులో పెడుతుందని స్పష్టం చేశారు. తమకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, చట్టం అన్నీ తెలుసునని, తనతో సహా చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.

రైతుల కోసం వేల కోట్లు కేటాయించాం..

బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం రైతుల కోసం బడ్జెట్ లో రూ.72 వేల కోట్లు పెట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సారి వరి ఎక్కువగా పడిందని, 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. గత పదేండ్లు రాచరిక పాలన చేసిన వాళ్లు అది పీకుతాం.. ఇది పీకుతాం.. ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి ఘాటుగా విమర్శించారు. 

ప్రతిపక్షాలు మంచి సూచన చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం కోనాయిగూడెం గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని, దానిలో భాగంగానే విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు శాఖమూరి రమేశ్, యోనికే జానకి రామయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.