ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర తీరంలో డిసెంబర్ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రపంచంలోని అంబేద్కర్వాదులంతా తెలంగాణ వైపు చూసేలా చేస్తామని అన్నారు. సచివాలయంలో ఉండే పాలకుకు స్ఫూర్తివంతంగా ఉండేలా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు రూ.200 కోట్ల రాయితీ విడుదల చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ నేతృత్వం ఒకవైపు అంబేద్కర్ రాజ్యాంగం మరోవైపు ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చేందుకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన తండాలను పంచాయితీలుగా మార్చినట్లు చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదెవరో, రాజ్యాంగ వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని రాచరిక పాలన చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసని అన్నారు.
ఉరుకుతున్న కాళ్లలో కట్టె అడ్డం పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సర్కారు చేస్తున్న మంచి పనులను ప్రతిపక్షాలు అప్పుడప్పుడైనా అభినందించాలని కోరారు. దళిత బంధు సక్సెస్ అయితే కేంద్రానికి మన రాష్ట్రమే రోల్ మోడల్ అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్నవి ఉన్నోడు, లేనోడు అనే రెండే కులాలన్న ఆయన.. మనం ఏ కులంలో పుట్టాలన్నది మన చేతిలో లేదని అన్నారు. భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మంచి విద్య అందిచాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టామని.. ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పిల్లలను తయారు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.