యాదాద్రి భువనగిరి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ ఓటర్లను కోరారు. ప్రశ్నించే గొంతుకను చట్టసభకు పంపాలని చెప్పారు. ఈనెల 27వ తేదీ సోమవారం వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈక్రమంలో భువనగిరిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాదించిందని.. ఓటు వేసే ముందు పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాల చూసి ఓటేయండి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేకుండే .. కేసీఆర్ నేతృత్వంలో మూడు మెడికల్ కళాశాలను ఇచ్చామన్నారు. మా ఓటమికి రెండు కారణాలు.. ఒకటి చేసిన పనిని చెప్పుకోలేదు .. రెండోవది, కొన్ని వర్గాలను దూరం చేసుకున్నామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు రైతుబంధు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పాత్రలు ఇచ్చి.. మేము ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధలు చెప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించే వాళ్ళు కాదని.. ధిక్కారస్వరాలు వినిపించే వాళ్ళు కావాలన్నారు. ఎవరు కావాలో మీరే ఆలోచించుకోండని కేటీఆర్ అన్నారు.