మునుగోడుకు కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ అన్నారు. చౌటుప్పల్ కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. యువకుల జోష్ చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని తెలుస్తోందన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ పాట పాడారంటూ విమర్శలు చేశారు. ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రికేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో తెలియాలంటే గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. 65 ఏళ్లలో పరిష్కారం కానీ ఫ్లోరోసిస్ ను ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వమే రూపుమాపిందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నాలుగేళ్లలో జరగని అభివృద్ధిని..కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన తర్వాత తానే నియోజవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు.
మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్ రూ. 19వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తే ..19 పైసలు కూడా కేంద్రం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతుండంట. ఆ తులం బంగారం తీసుకోని కారు గుర్తుకు వేయండి’ అని ఓటర్లను కోరారు. మర్రిగూడలో 300పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుందని, మహిళలు గ్యాస్ బండకు దండం పెట్టి కారు గుర్తుకు ఓట్లు వేయాలన్నారు. చేనేతల మీద పన్ను వేసిన మొదటి ప్రధాని మోడీనేనని విమర్శించారు.