
- కేటీఆర్, ఇతరుల పిటిషన్‌పై ముగిసిన వాదనలు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయని, తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా పేర్కొంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతంపై డ్రోన్స్ ఎగురవేయకుండా నోటిఫికేషన్ వెలువరించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు.
అయితే, కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వకుండా, తాము కోరామని చెబితే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. మేడిగడ్డ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారని 2024 జులై 29న మహదేవపూర్ పోలీసులు కేటీఆర్, తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్, గండ్ర, సుమన్ పిటిషన్ వేశారు. పిటిషనర్లు ప్రాజెక్టును సందర్శించిన మూడు రోజులకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలీ షేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు.
గత ఏడాది జులై 26న మేడిగడ్డను సందర్శించగా, అదే రోజు కాకుండా జులై 29న కేసు నమోదు చేశారని వివరించారు. అధికారిక రహస్యాల చట్టం కింద ఆయా ప్రాంతాలను నిషేధిత జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని చట్టం స్పష్టం చేస్తోందన్నారు. మేడిగడ్డలో తగినంత నీరు ఉన్నప్పటికీ విడుదల చేయనందున, కేటీఆర్ తదితరులు సందర్శించిన మాట వాస్తవమేనన్నారు. మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కుంగిపోయాయని, అక్కడ డ్రోన్స్ ఎగురవేస్తే ప్రమాదమని, అందుకే దానిని నిషేధిత ప్రాంతంగా ప్రభుత్వం నిర్ణయించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.