ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదంటున్నరు : మంత్రి కేటీఆర్

  • ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదంటున్నరు
  • తెలిసి మాట్లాడుతున్నరా..తెలియక మాట్లాడుతున్నరా అర్థమైతలేదు
  • కాళేశ్వరంపై ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని  పండగలా మార్చిన ఘనత కేసీఆర్ దేనని  ఐటీ, మున్సిపల్​ మినిస్టర్​ కేటీఆర్​ కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో  బుధవారం వ్యవసాయ కళాశాలను మంత్రి  నిరంజన్ రెడ్డి, స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.  కేటీఆర్​ మాట్లాడుతూ..  తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోందన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని, వారు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

సమైక్య రాష్ట్రంలో  ఒక్క రిజర్వాయర్ లేదని, హెలిక్యాప్టర్​లో ఇక్కడకు వస్తుంటే వరుసగా ఉన్న కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరు నీళ్లతో కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందన్నారు. జిల్లెల్ల కాలేజీని అగ్రికల్చర్​ యూనివర్సిటీకి  శాటిలైట్ క్యాంపస్ గా గుర్తించి పీజీ కాలేజీగా అప్​గ్రేడ్ చేయాలని, కాలేజీకి బాబూ జగ్జీవన్​రామ్​ పేరు పెట్టి, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని  మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైనప్పుడు కోటి 8 లక్షల ఎకరాల్లో పంటలు  సాగు కాగా,  కేసీఆర్ చొరవతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం 2 కోట్ల 30 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాలలో 700 లోపే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని,  వాటి ప్రాధాన్యాన్ని  గుర్తించి తెలంగాణలో వీలైనన్ని కాలేజీలను  ఏర్పాటు  చేస్తున్నామని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్​ బాబు, సుంకె రవి శంకర్, జయశంకర్‌‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్​చార్జి వైస్ చాన్స్ లర్​  రఘునందన్ రావు , రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ బాబు, ప్రవీణ్ రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్​ కలెక్టర్ బి.సత్యప్రసాద్, రాష్ట్ర పవర్‌‌లూం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ గూడూరి ప్రవీణ్‌‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ పాల్గొన్నారు.