కేసీఆర్​ అంటే ఆత్మీయ బంధువు : కేటీఆర్​

 కేసీఆర్​ అంటే ఆత్మీయ బంధువు : కేటీఆర్​
  • అందరూ ఆయననే తలుచుకుంటున్నరు: కేటీఆర్​
  • బ్యాగులు మోసి రేవంత్​ సీఎం అయిండు
  • కమీషన్ల కోసం పనులు చేయడంతోనే ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ కూలిందని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ అంటే ప్రజలకు ఆత్మీయ బంధువు అని, ప్రజలంతా ఆయననే తలుచుకుంటున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ‘‘ఎట్టి పనికైనా మట్టిపనికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తుంటరు. తెలంగాణపై కేసీఆర్​కు ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్​, బీజేపీ నేతలకు ఉండదు. ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆరే శ్రీరామరక్ష.  పంచాయతీ ఎన్నికలైనా.. పార్లమెంట్​ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎగరాల్సింది గులాబీ జెండానే.

అప్పుడే తెలంగాణ నిలుస్తది, గెలుస్తది” అని పేర్కొన్నారు. కేసీఆర్​ మళ్లీ సీఎం అయితేనే దేశంలో తెలంగాణ అవ్వల్​ దర్జాగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్​ఎస్​లో చేరిన సందర్భంగా కేటీఆర్​ మాట్లాడారు. ‘‘బ్యాగులు మోసి రేవంత్​ రెడ్డి సీఎం అయిండు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటూ కాంగ్రెస్​ కొత్త ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​ మాట్లాడడం విడ్డూరంగా ఉంది.  సీఎం చేసిన చెడుల గురించి చెప్పుకుంటూ పోతే ఆయన చెవుల నుంచి రక్తం కారుతుంది. రేవంత్​రెడ్డిని రాష్ట్రంలో తిట్టని వాళ్లు లేరు. ఆయనకు  రోషం ఉన్నట్టయితే ఈపాటికే చచ్చిపోయేవాడు” అని దుయ్యబట్టారు. 

అంతులేని అవినీతితో  ఎస్​ఎల్​బీసీ టన్నెల్ కుప్పకూలిందని వ్యాఖ్చానించారు. ‘‘కమీషన్ల కోసం ఆగమాగం పనులు చేయడంతోనే ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ కూలిపోయింది. 15 నెలల తర్వాత సొరంగం కూలిపోతే బీఆర్​ఎస్​ వల్లే కూలిందని కొందరు మంత్రులు మాట్లాడుతున్నరు” అని దుయ్యబట్టారు. హైడ్రా విధ్వంసం సృష్టిస్తున్నదని, భూ కబ్జాలకు లెక్కలేకుండా పోయిందని ఆరోపించారు. మరోవైపు, బీఆర్​ఎస్​ ప్రభుత్వం పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పూర్తి చేసిందని, అయితే, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా మూసీ సుందరీకరణను సీఎం ముందటేసుకున్నారని వ్యాఖ్యానించారు. దీని వచ్చే లాభం ఏమిటని కేటీఆర్​ ప్రశ్నించారు.