ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 2025, జనవరి 16వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరలిరావటంతో.. ఆఫీస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పరిసరాల్లో ఎవర్నీ అనుమతించటం లేదు.
ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. ఇప్పుడు ఈడీ విచారణతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈడీ విచారణ కంటే ముందే.. ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు.. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. నిబంధనలకు విరుద్ధంగా.. విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు తరలింపునకు సంబంధించి.. మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.
విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయల తరలింపునకు సంబంధించి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒత్తిడితోనే.. నిబంధనలకు విరుద్ధంగా.. రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ FIR లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు.
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరి స్టేట్స్ మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను కీలకమైన ప్రశ్నలు సంధించనుంది ఈడీ. కేటీఆర్ జవాబులకు కౌంటర్‌గా ఎలాంటి ఆధారాలను చూపించాలనే విషయమై ఈడీ ఇప్పటికే పక్కాగా ప్రిపేర్ అయ్యింది.