- అసలైన బాంబులకే భయపడలేదు.. పొంగులేటి తుస్సు బాంబుకు భయపడుతమా: కేటీఆర్
- విద్యుత్ చార్జీలు పెంచితే ఊరుకోబోమని ఫైర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపుతామంటే భయపడబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. దీపావళికి ముందే రాష్ట్రంలో బాంబులు పేలుతాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘‘పొంగులేటి.. తన ఇంట్లో జరిగిన ఈడీ రైడ్స్ గురించి చెబుతారేమో.. బీజేపీతో ఎట్ల సంది కుదుర్చుకున్నది చెప్తాడో లేదా అమృత్ స్కీమ్‌లో సీఎం బావమరిదికి రూ.1,137 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చి స్కాం చేశారనే బాంబు పేల్చుతారో చూడాలి’’ అంటూ కామెంట్ చేశారు. శుక్రవారం సిరిసిల్లలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘చావుకు తెగించి తెలంగాణ తెచ్చినోళ్లం. తెలంగాణ ఉద్యమంల రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు లాంటోళ్లతో కొట్లాడినం.. గీ చిట్టినాయుడు ఓ లెక్కనా.. నా మీద ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో.. ఏం పీక్కుంటవో పీక్కో.. అసలైన బాంబులకే భయపడలే. గీ లక్ష్మీబాంబు, సుతిల్ బాంబులకు భయపడుతమా? మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమేనని, ఎవరు రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నారో.. బిల్డర్లను బెదిరించి ఎవరు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారో.. వారి వద్ద నుంచి మిత్తితో సహా కక్కిస్తాం”అని కేటీఆర్ అన్నారు.
ప్రజలపై రూ.18,500 కోట్ల భారం మోపే కుట్ర..
విద్యుత్ చార్జీలు పెంచితే ఊరుకోబోమని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని కేటీఆర్ హెచ్చరించారు. శుక్రవారం సిరిసిల్ల సహకార విద్యుత్ సంఘం(సెస్) లో విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన బహిరంగ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18,500 కోట్ల భారం మోపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంచేందుకు సర్కార్ చేస్తున్న ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీని కోరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులే..
‘‘జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని సంజయ్ అంటున్నరు. మరి గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పిచ్చుకున్నవా. పార్టీ మారినోళ్లు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో ఎలా చేరతారు? పార్టీ మారిన పది మంది ఎమ్యెల్యేలు రాజకీయ వ్యభిచారులే”అని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెసోళ్లను చంపుకుంటున్నారు. పోలీసోళ్ల కుటుంబాలను పోలీసోళ్లే కొడుతున్నారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎక్కడాలేదు. రేవంత్ రెడ్డి మాత్రం మోదీ నాయకత్వంలో పని చేస్తున్నారని జీవన్ రెడ్డికి అర్థమైంది’’అని కేటీఆర్ఎద్దేవా చేశారు.