హైదరాబాద్: ఫార్మూలా- ఈ-కార్ రేస్ కేసులో తన పైన కేసు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో స్పందించారు. ఇప్పుడే తమ సభ్యులు చెబుతున్నారని, తనపై ఏదో కేసు నమోదు చేశారని చెప్పారని కేటీఆర్ సభకు తెలిపారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే.. నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా ఈ-కార్ రేస్ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని స్పీకర్ను కేటీఆర్ కోరారు. ఈ--రేసులో జరిగిన అన్ని అంశాల పైన చర్చకు సిద్దంగా ఉన్నానని కేటీఆర్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారని, కేటీఆర్పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మూలా- ఈ-కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేస్ నిర్వహించామని మాజీ మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు.
ALSO READ | బిగ్ బ్రేకింగ్.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్పై కేసు.. A1 ఆయనే
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 409, 120B సెక్షన్ల కింద కూడా ఆయనపై కేసులు నమోదు కావడం గమనార్హం. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం. ఏ1గా కేటీఆర్ పేరును చేర్చిన ఏసీబీ.. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును ఫార్మూలా- ఈ-కార్ రేస్ కేసులో చేర్చడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.