హైదరాబాద్: రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో ఆదివారం (అక్టోబర్ 27) కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కుట్ర చేస్తోందని అన్నారు. ఓ కుటుంబం ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారని అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్.. అది ఫామ్‌హౌస్ కాదని.. అది నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న ఇల్లు. అక్కడ జరిగింది ఫ్యామిలీ ఫంక్షన్ అని క్లారిటీ ఇచ్చారు.
ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీ అంటున్నారని ఫైర్ అయ్యారు. అసలు రేవ్ పార్టీ అంటే తెలుసా అని ప్రశ్నించిన కేటీఆర్.. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారు కానీ దానిని రేవ్ పార్టీ అని చెప్పి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అక్కడ ఫ్యామిలీలు ఉంటే మహిళలు, పరుషులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ ఫంక్షన్లో మా అత్తమ్మ, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరణ ఇచ్చారు.
ఫంక్షన్ అన్నప్పుడు మద్యం తీసుకోవచ్చు.. నేను కాదనన్నారు.
Also Read :- బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. బంగ్లా నుండి వలసలు బంద్
రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుందని.. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమని.. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఒక్కరికి డ్రగ్స్ పాజిటివ్ వస్తే.. ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో విచారించిండని సూచించారు.