కోమటిరెడ్డి బ్రదర్స్ కు డబ్బు ఎక్కువై ఎగిరెగిరి పడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు అనగానే కాంగ్రెస్, బీజేపీ నేతలకు జనం గుర్తుకు వస్తారని మండిపడ్డారు . నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాను నాశనం చేశారని ఫైరయ్యారు. తెలంగాణ రాకముందే వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో గుర్తు చేసుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ ను ఓడగొట్టడానికి మోదీ, రాహుల్ గాంధీ, సోనియా , డీకే లాంటి నేతలు వస్తున్నారని చెప్పారు. బక్క పల్చటి కేసీఆర్ మీదకి ఢిల్లీ, గుజరాత్ నాయకులు దండయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ సీఎం అవుతారని.. మరి కాంగ్రెస్,బీజేపీలు గెలిస్తే ఎవరు సీఎం అవుతారో కూడా తెల్వదన్నారు. సింహం లాంటి కేసీఆర్ కావాలా? సీల్డ్ కవర్లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలన్నారు. మూడోసారి కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో తెల్లకార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి 15 లక్షల బీమా అందజేస్తామన్నారు కేటీఆర్.