పన్నుల పేరుతో 30లక్షల కోట్లు దండుకున్నరు : కేటీఆర్

పన్నుల పేరుతో 30లక్షల కోట్లు దండుకున్నరు : కేటీఆర్
  • అదానీ, అంబానీల 18లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన్రు
  • తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్
  • బీజేపోళ్లు గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
  • సిరిసిల్ల కార్నర్ మీటింగ్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్

రాజన్నసిరిసిల్ల/మాదాపూర్, వెలుగు:  పెట్రోల్, డీజిల్, రోడ్ ట్యాక్స్ పేరుతో పేదల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రూ.30లక్షల కోట్లు దండుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలా దోచుకున్న డబ్బులోంచి అదానీ, అంబానీలకు రూ.18లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది అబద్ధమని కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా రాజీనామా లేఖను బీజేపీ నేతల ముఖాన కొడతానని అన్నారు. 

సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. కార్నర్ మీటింగ్​లో మాట్లాడారు. ‘‘నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు చమురు ధర బ్యారెల్ 100 డాలర్లు ఉండేది. ఆ తర్వాత 84 డాలర్లకు తగ్గింది. అయినా, మోదీ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోయారు. పన్ను రూపంలో మొత్తం రూ.30లక్షల కోట్లు దోచుకున్నారు. అప్పుడు 60 రూపాయలకు లీటర్ డీజిల్ దొరికేది. 

ఇప్పుడు రూ.105కి పెరిగింది. 74 రూపాయలకు లీటర్ పెట్రోల్ దొరికేది.. ఇప్పుడు రూ.110కి పెరిగింది. బీజేపోళ్లకు 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తా అంటున్నరు. జూన్ 2 తర్వాత హైదరాబాద్​ను యూటీ చేయాలని బీజేపీ కుట్ర పన్నుతున్నది. జిల్లాలను రద్దు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఇలాంటి వాటిపై కొట్లాడాలంటే.. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి. బండి సంజయ్ ఏం డెవలప్ చేయలే. ఒక గుడి బడి కూడా కట్టలే’’అని విమర్శించారు.

12 సీట్లిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తరు

లోక్​సభ ఎన్నికల్లో కేసీఆర్​కు 12 సీట్లు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ అన్నారు. పదేండ్ల నిజం, 150 రోజుల అబద్ధానికి జరుగుతున్న ఎన్నిక ఇది అని చెప్పారు. ‘‘కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెప్తా. ఈ ఎన్నికల్లో పది, పన్నెండు సీట్లిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతరు. కేసీఆర్ మల్లన్నసాగర్, రంగానాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్ట్ లు కట్టి.. వాటికి దేవుళ్ల పేర్లు పెట్టిండు. బీజేపీ లీడర్లేమో దేవుళ్ల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నరు. 

ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోవాలి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. ఆయన్ను గుర్తుపట్టేటోళ్లు ఎవరూ లేరు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో ఏ ఒక్క పద్మశాలి ఆత్మహత్య చేసుకోలే.. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు మొదలైనయ్’’అని అన్నారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టేసి కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. 19వ తేదీన కేసీఆర్ సిరిసిల్ల వస్తున్నారని, ఆయన రోడ్ షోను సక్సెస్ చేయాలని అన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిందం కళ, గుడూరి ప్రవీణ్ ఉన్నారు.

12 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే బీఆర్ఎస్​ కింగ్ ​అవుతుంది

ఎంపీ ఎన్నికల్లో 10 నుంచి -12 స్థానాలలో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను  ప్రజలు గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పిన గ్యారంటీల్లో తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. సోమవారం సాయంత్రం కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ రోడ్డు, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్​కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లంతా కేసీఆర్​కు అండగా నిలిచారు. బీఆర్ఎస్​కు 16 సీట్లు, బీజేపీకి ఒక సీటు ఇచ్చారు. కాంగ్రెస్ కు ఖాతా తెరవనివ్వలేదు. జిల్లాల్లోని తమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు కాంగ్రెస్ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయారు. వాళ్లిచ్చిన హామీలకు ఆగమయ్యారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలి’’అని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ కూడా ఏదీ నెరవేరలేదన్నారు. నమో అంటే నరేంద్ర మోదీ కాదని.. నమ్మించి మోసం చేయడమే అని విమర్శించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు.