తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు : కేటీఆర్​

తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు : కేటీఆర్​
  • హెచ్​ఎండీఏ పరిధిలో జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు బంద్​ మూర్ఖపు చర్య
  • పేద, మధ్య తరగతి ప్రజలను సర్కార్​ టార్గెట్​ చేసిందని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, హక్కుల కోసం పోరాడితే బెదిరిస్తూ సస్పెన్షన్లు చేస్తున్నారని శనివారం ఆయన ట్వీట్​చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు.

హెచ్​ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీ (జీపీ) లే అవుట్లలో ఉన్న వెంచర్లకు రిజిస్ట్రేషన్లను బంద్​ పెట్టడం మూర్ఖపు చర్య అని కేటీఆర్​ అన్నారు. పరిపాలనా అనుభవ లేమితో రేవంత్​ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మొన్నటిదాకా హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడును కూల్చేసిన రేవంత్​ సర్కారు.. ఇప్పుడు హెచ్​ఎండీఏ పరిధిలోని పేదలను ప్రజలను టార్గెట్​చేసిందన్నారు. వారి ప్లాట్లపైనా ఆర్​ఆర్​ ట్యాక్స్​ను వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎల్​ఆర్​ఎస్​ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నో ఏండ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. మళ్లీ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలంటే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.