కేంద్రం ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు  టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు . ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కు హాజరయ్యారు కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..బీజేపీ తీరు నిరంకుశత్వంగా ఉందన్నారు. బీజేపీకి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరుతో  బీజేపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షాల కూటమిలో ఉన్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.  బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థికి తాము మద్దతిచ్చామన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని చాలా సార్లు కేంద్రాన్ని కోరామని చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల మీద తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలన్నారు.  గిరిజన వర్శిటీ ఇప్పటి వరకు లేదన్నారు. బీజేపీకి  కేసీఆర్ బొమ్మ తప్ప వేరే దిక్కులేదన్నారు.  మోడీ ఫోటోకు  చెప్పులేసి గాడిద మీద ఊరేగించగలం కానీ అలా చేయబోమన్నారు. 

ఒడిశాలో 2006లో  స్టీల్ ప్లాంట్ వద్ద గిరిజనులను చంపిన ప్రభుత్వంలో ఆ నాడు  ద్రౌపది ముర్ము మంత్రిగా ఉన్నారన్నారు. అయినా ముర్ము నోరు మెదపలేదని.. సానుభూతి కూడా తెలపలేదన్నారు.   మోడీ మూడు సార్లు సీఎం అయినా గుజరాత్ లో  ఇంత వరకు కరెంట్ లేదన్నారు. ద్రౌపది ముర్ము సొంత  గ్రామానికే ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారన్నారు. అందరికి విద్యుత్ సౌకర్యం ఇచ్చామన్న  మోడీ మాటలు అబద్ధమన్నారు.  రాజ్యాంగాన్ని కాలరాసి మెజారిటీ లేకపోయినా  ప్రభుత్వాలు  ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే జుమ్లా..లేకుంటే హమ్లా మోడీ ఫార్ములా అని అన్నారు. 

తెలంగాణ నుంచే ధిక్కార స్వరం వినిపించి దేశాన్ని చైతన్యం చేయొచ్చాన్నారు. మోడీ 8 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏం లేదన్నారు. బీజేపీ కంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా టీఆర్ఎస్ కు  ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన దాని కంటే కేంద్ర  ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానన్నారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యాక దళితుల బతుకులు ఏమైనా మారిపోయాయా అని ప్రశ్నించారు.  విషం చిమ్ముడు తప్ప బీజేపీ నాయకుల దగ్గర విషయం లేదన్నారు కేటీఆర్.