కేసీఆర్ జనంలోకి వచ్చేది అప్పుడే..త్వరలో పాదయాత్ర చేస్త: కేటీఆర్

కేసీఆర్ జనంలోకి వచ్చేది అప్పుడే..త్వరలో పాదయాత్ర చేస్త: కేటీఆర్
  • 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌25లో జనంలోకి కేసీఆర్ ఆయన ఆరోగ్యంగానే ఉన్నరు :  కేటీఆర్
  • త్వరలో పాదయాత్ర చేస్త: కేటీఆర్
  • కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శాపం
  • కుటుంబాలను పాలిటిక్స్​లోకి లాగొద్దని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: 2025లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి వస్తారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యక్రమాల విషయాల్లో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. హామీలు అమలు చేసేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వివరించారు. గురువారం ట్విటర్​లో ‘ఆస్క్ కేటీఆర్’లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల కోరికమేరకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్త. తెలంగాణకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నది. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులు ప్రారంభించింది. సన్న వడ్లకూ బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కిపోతున్నది’’అని కేటీఆర్ తెలిపారు. 

రాజకీయాలు వదిలేయాలన్నంత బాధ అనిపించింది

కాంగ్రెస్ పాలనలో జరిగే నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన పోరాడుతాం. కాంగ్రెస్​కు ప్రజలు ఐదేండ్ల పాటు అవకాశం ఇచ్చారు. అప్పటి దాకా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. మా పదేండ్ల పాలనలో ఏనాడూ ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగలేదు. మా ఫ్యామిలీ మెంబర్ల పట్ల కాంగ్రెస్ చాలా నీచంగా మాట్లాడుతున్నది. ఇలాంటి మాటలు విన్నాక రాజకీయాలు వదిలేయాలన్నంత బాధ అనిపించింది. సీఎం, ఆయన మద్దతుదారులపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. రేవంత్ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి నీచమైన రాజకీయ సంస్కృతి చూస్తున్నం’’అని కేటీఆర్ మండిపడ్డారు.

పెద్ద బిల్డర్లను హైడ్రా ముట్టుకోలేదు

మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్నది బ్యూటిఫికేషన్ కాదని.. లూటిఫికేషన్ అని విమర్శించారు. ‘‘మూసీ ప్రక్షాళన.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అవుతది. హైడ్రా కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నది. ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్​ను కూడా హైడ్రా ముట్టుకోలేదు. పేద, మధ్య తరగతి ప్రజలనే ఇబ్బందులకు గురి చేస్తున్నది. బీఆర్ఎస్ లీడర్లపై చట్టవిరుద్ధంగా రెచ్చిపోతున్న పోలీసు అధికారులను గుర్తు పెట్టుకుంటం. మేము అధికారంలోకి వచ్చాక వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రానికి పూర్తి స్థాయి హోంమంత్రి అవసరం. ఎలాంటి కారణం లేకుండా హైదరాబాద్​లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించడం షాక్​కు గురి చేసింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తది. పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు వస్తాయి’’అని కేటీఆర్ అన్నారు.