గోపన్​పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభించండి: కేటీఆర్

గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్​పల్లి ఫ్లైఓవర్ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ పనులు కంప్లీట్ అయి నెలలు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవగాహన లేని నాయకత్వం కారణంగానే ఇలా జరుగుతున్నదని ట్విట్టర్​లో ఫైర్ అయ్యారు. గోపన్​పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభిస్తే.. ఐటీ కారిడార్ నుంచి నల్లగండ్ల, తెల్లాపూర్, గోపన్​పల్లి, చందానగర్ వైపు వచ్చి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని తెలిపారు. 

దీన్ని దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మించిందని చెప్పారు. పనులన్నీ పూర్తయి నెలలు గడుస్తున్నా.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు పట్టవని తెలిపారు. ఆ పార్టీ నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇస్తారని విమర్శించారు. ఫ్లై ఓవర్​ను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు ఓపెన్ చేసుకోవాలని సూచించారు.