![కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్](https://static.v6velugu.com/uploads/2025/02/ktr-said-that-kcr-will-become-telangana-cm-again_ToYr7th1JX.jpg)
- మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తడు: కేటీఆర్
- సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నడు.. ఆయన మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్
- ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌కు గుండు సున్నా తెచ్చిండు
- బీజేపీ, మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే
- 16 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి బడ్జెట్లో తెచ్చిందేంది?
- స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆశీర్వాదం, బీఆర్ఎస్కార్యకర్తల సంకల్ప బలంతో కేసీఆర్మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. ‘‘అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు పోతడు. కానీ, మళ్లీ ఆ మబ్బులను చీల్చుకుని బయటకు వస్తడు.. ప్రపంచంలోని జీవరాశి ఎప్పటిలాగే బతికేందుకు అవకాశం ఇస్తడు. అట్లనే మన చంద్రుడు కేసీఆర్ కూడా తాత్కాలికంగా మబ్బుల చాటుకే పోయిండు. మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో ఆయన సీఎం అయితడు. ఇదే నేను ఇచ్చే మాట’’ అని ఆయన తెలిపారు.
శనివారం తెలంగాణ భవన్లో జరిగిన సిర్పూర్కాగజ్నగర్, వికారాబాద్నియోజకవర్గాల బీఆర్ఎస్కార్యకర్తలతో సమావేశంలో కేటీఆర్మాట్లాడారు. ‘‘ఐరన్ లెగ్రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌కు గుండు సున్నా తీసుకొచ్చిండు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించిండు” అని విమర్శించారు. దేశంలో బీజేపీని రాహుల్‌గాంధీనే గెలిపిస్తున్నారని.. ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీనేనని దుయ్యబట్టారు.
16 మంది ఎంపీలుండి గుండు సున్నా తెచ్చిన్రు
కాంగ్రెస్, బీజేపీ నుంచి 16 మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్ అన్నారు. ‘‘పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపడం లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నా వాళ్లు మాట్లాడ్తలే. తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం గులాబీ జెండానే.. గులాబీ కండువానే” అని వ్యాఖ్యానించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, ఇప్పటిదాకా 57 మంది స్టూడెంట్లు చనిపోయారని అన్నారు. 420 మంది రైతులు.. 100 మంది ఆటో డ్రైవర్లు.. 30 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కారు వచ్చాక చనిపోయారని తెలిపారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై ప్రజలు కోపంతో ఉన్నరు. సెక్యూరిటీ లేకుండా వస్తే సీఎం రేవంత్నైనా తన్నేలా ఉన్నరు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే వేరే వాళ్లెవరైనా బకెట్లో నీళ్లు పోసుకుని దూకి చనిపోతరు. కానీ, రేవంత్ రెడ్డి కాబట్టే వాటిని పట్టించుకోకుండా బతుకుతున్నడు” అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కొడంగల్ లోని ఒక గ్రామంలో 110 ఎకరాల భూసేకరణ కోసం 400 మంది పోలీసులను పంపి జనాలను భయపెట్టారని.. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆరోపించారు. ‘‘క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను వాడుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి” అని బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, టికెట్ ఎవరికిచ్చినా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
బీఆర్ఎస్ నుంచి మోసగాళ్లంతా పోయిన్రు
‘‘పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు వల్లే మెతుకు ఆనంద్ ఓడిపోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మోసగాళ్లంతా వెళ్లిపోయిన్రు. నిఖార్సయిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నరు” అని కేటీఆర్అన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్టే అసెంబ్లీని స్పీకర్‌గడ్డం ప్రసాద్ నడిపిస్తున్నారని, బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు మైక్ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘‘ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో మాత్రం బీఆర్ఎస్ నాయకులకు మైక్ఇచ్చేందుకు వణికిపోతున్నడు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ఫుట్బాల్ఆడుతున్నరు” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 శాతం కూడా రుణమాఫీ కాలేదన్నారు. పాలమూరు –రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిందని, కాంగ్రెస్ వాళ్ల కేసులతోనే పనులు నిలిచిపోయాయని తెలిపారు.