- పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలి
- ఓటమితో కుంగిపోవద్దు : కేటీఆర్
హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని, ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆరెస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లని.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు.