చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినం, లక్షల ఉద్యోగాలిచ్చినా నిరుద్యోగులు దూరమైన్రు: కేటీఆర్

చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినం, లక్షల ఉద్యోగాలిచ్చినా నిరుద్యోగులు దూరమైన్రు: కేటీఆర్

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు/ఖమ్మం, వెలుగు:  పదేండ్లలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని తెలిపారు. దీంతో నిరుద్యోగులు పార్టీకి దూరం అయ్యారని అన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీపై దుష్పప్రచారం కూడా ఓటమికి కారణమని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెంతో పాటు ఖమ్మంలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

 ‘‘దేశంలోని ఏ రాష్ట్రం కూడా పదేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త. మా హయాంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, పేపర్ లీకైందంటూ కొందరు సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం చేశారు’’అని మండిపడ్డారు.

కౌలు రైతులకిస్తామన్న రైతుబంధు ఏమైంది?

కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామన్నరు. ఇప్పటి వరకు ఒక్కరికి డబ్బులివ్వలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన్రు. ఐదు నెలలు దాటినా దాని గురించి ఊసే లేదు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అభయహస్తమని చెప్పి భస్మాసుర హస్తంగా మార్చింది. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఇప్పటి దాకా ఒక్కటీ అమలు చేయలేదు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నరు. మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలిస్తామన్నరు. ఆరు నెలలు గడిచినా ఒక్క జాబ్ ఇవ్వలేదు’’అని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. పోటీ పరీక్షలకు ఫీజులు ఉండవన్నారని, టెట్ ఫీజును రూ.400 నుంచి రూ.2వేలకు పెంచారని విమర్శించారు.

ఉన్న కంపెనీలైనా కాపాడుకోండి

హైదరాబాద్​కే పరిమితమైన ఐటీ రంగాన్ని తమ హయాంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టణాలకు విస్తరింపజేశామని కేటీఆర్ అన్నారు. ‘‘వరంగల్​కు టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు తీసుకొచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చాక ఆ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది. కొత్త పరిశ్రమలు తేకపోయినా.. ఉన్నవాటిని నిలుపుకునే తెలివి కూడా కాంగ్రెస్ సర్కార్​కు లేదు. బ్లాక్​మెయిల్ రాజకీయాలు, బూతులు మాట్లాడే వ్యక్తి కావాలా.. గోల్డ్ మెడలిస్ట్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తదితర అంశాల్లో మాట తప్పిన బీజేపీకి బుద్ధి చెప్పాలి. సింగరేణిని అదానీ పరం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నయ్’’అని అన్నారు. సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, ఎంపీలు నామా, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.