రేవంత్​ ఎప్పుడు జైలుకు పోతడో తెల్వదు .. కాంగ్రెస్​కు అధికారం ఇస్తే అంధకారమే: కేటీఆర్

  • వేములవాడ అభివృద్ధి బాధత్య మాదే
  •   గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నం
  •   బంతిభోజనంలో అన్నీ వచ్చినట్లే.. అందరికీ పథకాలు వస్తయన్న మంత్రి

వేములవాడ/చందుర్తి/కోనారావుపేట/సిరిసిల్ల, వెలుగు: కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఢిల్లీ దొరల చేతిలో పెట్టొద్దని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ​చేతిలో పెడితే అంధకారమేనని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ అన్నారు. ఎప్పుడు ఉంటాడో, మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని రేవంత్ రెడ్డికి అధికారం ఇవ్వొద్దని ఆయన ప్రజలను కోరారు.

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, భవిష్యత్​ బాగు కోసం జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బుధవారం కేటీఆర్​వేములవాడ, చందుర్తి, కోనారావుపేట, సిరిసిల్లలో పలు సభల్లో పాల్గొనడంతోపాటు రోడ్​షోలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్​ నాయకులు ఒక్క రూపాయి కూడా వేములవాడ గుడికి ఇవ్వలేదని,రాజన్న గుడి చెరువుకు గోదావరి జలాలు తెచ్చిన ఘనత బీఆర్ఎస్​ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.

వేములవాడ పట్టణం అభివృద్ధి బాధ్యత తమదేనన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉందని కరోనా వల్ల ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యమైందని రానున్న రోజుల్లో ప్రాజెక్టు నిర్మా ణాన్ని పూర్తి చేస్తామన్నారు. సీఎం మూడోసారి ముఖ్యమంత్రి కాగానే మన్నెగూడెంను మండల కేంద్రంగా చేసి, అక్కడ కాలేజీ పెడ్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గంను దత్తత తీసుకుంటానని కేటీఆర్​ హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్​తో బతుకులు ఆగమైతయి

దరిద్రపు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు బతుకులు మళ్లీ ఆగమైతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ ​మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక రైతులు పడ్డ ఇబ్బందులు చాలవా అని గుర్తు చేశారు. ఎప్పుడు ఉంటాడో, మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని రేవంత్ రెడ్డి చేతిలో అధికారం పెడితే రాష్ట్రం అంధకారమే అని మండిపడ్డారు.

కాంగ్రెస్​ను గెలిపిస్తే రైతులకు నిత్యం జాగారాలే మిగులుతాయని, ప్రజ లందరూ కష్టాల పాలవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రజలు మళ్లీ కన్నీళ్ల పాలవుతారని కరెంటు కోతలతో  ఇబ్బందుల పాలు కాక తప్పదన్నారు. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు.

గోదావరి జలాలతో కోనరావుపేట రైతుల కాళ్లు కడుగుతున్నామని, ఎక్కడ చూసినా పంట పొలాలే దర్శనమిస్తున్నాయని గుర్తు చేశారు. 29 రాష్ట్రాలకు బియ్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ  ఒక్కటేనన్నారు.

సిరిసిల్లకు గౌరవం తెచ్చిన

సిరిసిల్ల ప్రాంతానికి గౌరవం తెచ్చిన తప్ప, తలదించుకునే పని చేయలేదని కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తనను మళ్లీ గెలిపిస్తే.. సిరిసిల్లలో డబుల్ డెవలప్​మెంట్ చూపిస్తానన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం బాగు చేసుకొని, సాగు నీరు అందిస్తున్నా.. కేసీఆర్ ఏం చేయలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

బంతి భోజనంలో ఉన్నవారికి అన్నీ అందినట్లుగానే దళిత బంధు, బీసీ బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తామని కేటీఆర్ ​స్పష్టం చేశారు. కేటీఆర్ ​కార్యక్రమాల్లో వేములవాడ బీఆర్ఎస్​ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్​పర్సన్ న్యాలకొండ అరుణ-, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.