- హామీలు నెరవేర్చలేక అప్పులపై అబద్ధాలు చెప్తున్నరని ఫైర్
- ఎన్ని చేసిన చివరికి సత్యమే గెలుస్తుందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్నవన్ని దివాళాకోరు, తప్పుడు ఆరోపణలేనని కేటీఆర్ అన్నారు. ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ సూచీలను పరిశీలిస్తే సీఎం, ఆర్థిక మంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.
ఆర్థిక నిర్వహణలో2014–-15 నుంచి 2022-–23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఇండెక్స్ ను కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లో నూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన ఇండెక్స్ లను కేటీఆర్ ప్రజల ముందుంచారు.
ఆరు గ్యారెంటీలను..420 హామీలను అమలు చేయడం చేతగాక అప్పులపై తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. హామీలు అమలు చేతకాకే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా విష ప్రచారం చేస్తున్నారని, ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసిన చివరికి సత్యమే గెలుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలా?
ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వంపై ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేదిలేదని కేటీఆర్ హెచ్చరించారు. నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇకపై మీడియా, సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు.
ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు ఏనాడూ చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల పేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన 100 కోట్ల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలని ఆయన అన్నారు.