
- కులగణన సర్వే తప్పని ప్రభుత్వం ఒప్పుకుంది: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే తప్పుల తడక అని సర్కారు ఎట్టకేలకు ఒప్పుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బుధవారం ట్వీట్ చేశారు. బీసీల జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాల ప్రజలను మానసికవేదనకు గురిచేసిన సీఎం రేవంత్ రెడ్డి.. బీసీలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ పార్టీ, బీసీ సంఘాలు అభ్యంతరాలు చెప్పినా వినకుండా.. అసంపూర్తి లెక్కలతోనే సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేయడం ముమ్మాటికీ తప్పేనని కూడా అంగీకరించాలన్నారు.
రెండోసారి చేసే సర్వేనైనా సమగ్రంగా చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేవలం తూతూ మంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారును బీసీలెవరూ నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకుంటే మంచిదని కేటీఆర్ పేర్కొన్నారు.