
- నిన్న గేటు.. నేడు స్టార్టర్లు.. రేపు పుస్తెలతాళ్లు లాక్కెళ్తరు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు పట్ల ఆడబిడ్డలు జర పైలంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతులంటే సర్కారుకు అలుసైపోయారని, వారికి నరకం చూపిస్తున్నారని శనివారం ట్వీట్ చేశారు.‘‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు. రేపు పుస్తెలతాళ్లు లాక్కెళ్తారా? తెలంగాణ ఆడబిడ్డలారా ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం. అప్పుల పాలైన అన్నదాతలపై కాంగ్రెస్కు ఇంత కక్షనా? సాగునీరిచ్చే సోయి లేదు.
రైతులు కష్టాలు పడుతుంటే మాత్రం వేధింపులకు దిగుతారా? నీటి తీరువాను తీసుకొచ్చి వసూళ్లకు తెగబడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని.. ఈ సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా? రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై దాష్టీకాలేంటి? బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి? సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను.. తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు. సంఘటితంగా పోరాడుతది.. సీఎంకు బుద్ధి చెబుతది’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.