కొత్తకోట/వనపర్తి, వెలుగు : బీఆర్ఎస్ స్కీమ్‌ల పార్టీ అయితే, కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘‘మళ్లీ కాంగ్రెస్‌వస్తే కన్నీళ్లు తప్పవు. కాంగ్రెస్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నది. ఉనికి కోసం గ్యారంటీలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ వారెంటీ లేనోళ్ల గ్యారంటీలను ప్రజలు నమ్మరు” అని అన్నారు. కాంగ్రెస్ వస్తే 3గంటల కరెంట్, నల్లా నీళ్లు బంద్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాంటి గలీజ్ నాయకుడు మరొకరు లేరని కామెంట్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లాలో కేటీఆర్ పర్యటించారు.
కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు. ‘‘రాష్ట్ర రైతులంతా వరిపై ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో మన పిల్లలు వ్యవసాయం వైపు మళ్లాలంటే ఆయిల్ పామ్ సాగుపై దృష్టిపెట్టాలి” అని అన్నారు. రాష్ట్రంలో పండే ఆయిల్ పామ్ పంటను కొనేందుకు అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
నీటి వాటా తేల్చాలె..
ఒకప్పుడు కరువు ప్రాంతానికి కేరాఫ్ గా అడ్రస్ గా ఉన్న పాలమూరు జిల్లా.. ఇప్పుడు వ్యవసాయంలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా తయారవుతున్నదని కేటీఆర్ అన్నారు. అప్పట్లో జిల్లా నుంచి ప్రతిఏటా 14 లక్షల మంది వలస వెళ్తే ఏ సీఎం ఆపలేదని, బీఆర్ఎస్ వచ్చాకే పాలమూరు వలసలు ఆగాయన్నారు. ‘‘ప్రధాని మోదీ ఓట్ల మాయగాడు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మోదీ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదు” అని ప్రశ్నించారు. నీటి వాటాపై తేల్చకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల కేటాయింపులపై సంతకం చేసేందుకు మోదీకి చేతులు రావడం లేదని ఫైర్ అయ్యా రు. పాలమూరు జిల్లాకు వస్తున్న మోదీ.. భూత్పూర్ సభలోనే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటేనే ఆయన కక్ష్యపూరితంగా వ్యవహరి స్తున్నారని, వాల్మీకీ బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా పట్టించుకోలేదని మండిపడ్డారు.