నిరంజన్​రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి : కేటీఆర్

వనపర్తి, వెలుగు:  మంత్రి నిరంజన్​రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వనపర్తి పదేళ్ల ప్రగతి సభలో ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ తో కలిసి 22 అభివృద్ది కార్యక్రమాలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. రూ.425 కోట్లతో వనపర్తి, పెద్దమందడి పట్టణాలకు తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో ఆయిల్ పాం కొనుగోలు కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలి రోజు నుంచే నిరంజన్ రెడ్డి ఆయనకు కుడి భుజంగా ఉంటూ నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు. పదవుల కోసం ఆలోచించలేదని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి, 70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయలేనంత అభివృద్ధి చేసి చూపించారని అభినందించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో, పాలమూరు జిల్లా అభివృద్ధిలో నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా వనపర్తిలో డెవలప్​మెంట్​జరుగుతోందన్నారు. 

అక్కడ తమకు వచ్చినట్లుగా నిరంజన్ రెడ్డికి మెజార్టీ ఇవ్వాలని కోరారు. డిగ్రీ కాలేజీ కోసం ధర్నా చేసే స్థితి నుంచి వనపర్తికి మెడికల్, జేఎన్టీయూ కాలేజీలను సాధించడంలో సింగిరెడ్డి కృషి ఉందన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి తనను గెలిపించాలని కోరారు. అంతకుముందు వనపర్తి పట్టణంలో ఐటీ టవర్ కు శంకుస్థాపన చేశారు. జిల్లా గ్రంథాలయం, టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ప్రారంభించారు. గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, రమేశ్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, ఆవుల రమేశ్​ పాల్గొన్నారు.