రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ

ఆఫీసర్లకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు ఇచ్చారన్న కేటీఆర్​

రైతు సమన్వయ సమితులు రైతు బంధు సమితులుగా మార్పు !

డీసీసీబీ చైర్మన్​, వైస్​ చైర్మన్లతో తెలంగాణ భవన్​లో సమావేశం

హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీకి సంబంధించిన పనులు త్వరలో పూర్తి చేయాలని ఆధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించినట్లు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.  స్వయంగా రైతు అయిన కేసీఆర్​ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం వల్లే రాష్ట్రంలో రైతు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, తమ ప్రభుత్వం రైతు పక్షపాత సర్కారు అన్నారు. అలాగే రైతు సమన్వయ సమితిల పేరును రైతు బంధు సమితిలుగా మార్చనున్నట్టు తెలిపారు.

డీసీసీబీ ఎన్నికల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా గెలిచినవారితోపాటు రాష్ట్ర మంత్రులతో తెలంగాణ భవన్‌‌‌‌లో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి జిల్లా మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా చైర్మన్, వైస్ చైర్మన్‌‌‌‌గా 48 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌కు రైతులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉందని, వారి కోసం రైతు బీమా, రైతు బంధులాంటి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.  రైతులు మన మీద అపారమైన ప్రేమతో 906 సంఘాల్లో 94 శాతానికి పైగా మనకు కట్టబెట్టి అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా రుణమాఫీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలు గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత సహకార సంఘాల నాయకులదేనన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, నిరంజన్​రెడ్డి,  జగదీశ్​రెడ్డి, గంగుల కమలాకర్​, ప్రశాంత్​రెడ్డి, సత్యవతి పాల్గొన్నారు.

For More News..

రేవంత్​ ఓ కబ్జా కోరు

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!