తెలంగాణకి గులాబీ జెండానే శ్రీరామరక్ష : కేటీఆర్

తెలంగాణకి గులాబీ జెండానే శ్రీరామరక్ష : కేటీఆర్
  • హైదరాబాద్​ను యూటీ కానివ్వం: కేటీఆర్
  • అంబర్​పేటలో రోడ్​షో 

అంబర్​పేట్, వెలుగు: ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్​ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్​లో కచ్చితంగా ఉండాలన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఏం అవసరమని కొందరు అంటున్నరు. గతంలో కూడా ఇట్లనే అన్నరు. అప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామ రక్ష’’అని అన్నారు.

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి అంబర్​పేట తిలక్​నగర్​లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్​కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఐదేండ్లలో కిషన్ రెడ్డి అంబర్​పేట్​కు ఒక్క రూపాయి తేలేదు. ఒక గుడి, బడి కట్టలేదు. అలాంటప్పుడు ఆయనకు ఓటెందుకెయ్యాలి? బీజేపీకి ఓటేస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచుతరు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అయితే.. కవిత జైల్లో ఉండేదా? కాంగ్రెస్ లీడర్లు అరచేతిలో వైంకుఠం చూపిస్తే జిల్లా, గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్మి మోసపోయారు’’అని అన్నారు. 13వ తేదీన కారు గుర్తుకు ఓటేసి 12 స్థానాల్లో బీఆర్ఎస్​ను గెలిపిస్తే ఆరు నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని తెలిపారు. పద్మారావు గౌడ్​ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.