యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వమని ప్రధాని మోడీని అడిగితే.. కనీసం100 రూపాయలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి ఆలయాన్ని తిరుపతికి ధీటుగా అభివృద్ధిచేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేవుళ్లను రాజకీయం కోసం వాడుకోవడం తప్ప బీజేపీకి మరేంత తెలియదని చెప్పారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన మోడీ సర్కారు.. చేనేత వృత్తికి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిందన్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలో కొనసాగితే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డును ప్రధాని మోడీయే రద్దు చేశారని తెలిపారు. నేత కార్మికులకు పనికొచ్చే ఒక్క పనిని కూడా మోడీ చేయలేదన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా చండూరులో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
‘‘ ఇది బలవంతంగా ప్రజలపై రుద్దిన ఎన్నిక. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా బీజేపీ నిలబెట్టుకోలేదు. ఒక్క రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఎక్కడ ఎన్నిక వస్తే అక్కడ వెయ్యి కోట్లు ఇస్తమని బీజేపీ వాళ్లు ప్రకటిస్తున్నరు. మునుగోడులోనూ అదే విధమైన బూటకపు హామీలు ఇస్తున్నరు. వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘చేసేదేమో పకోడీల పని... చెప్పేదేమో కోట్ల మాట’’ అనేలా బీజేపీ నాయకుల తీరు ఉందన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవగానే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.