తెలంగాణ వల్లే దేశ రైతులకు మంచిరోజులొచ్చాయి : KTR

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. మిడ్ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించిన కేటీఆర్.. వినోద్ ను ఎంపీగా గెలిపిస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్ర నిధులు వస్తాయన్నారు.

ఈ లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు KTR. 71 ఏళ్లు గడిచినా కూడా.. దేశం ఇంకా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని చెప్పారు. “కేసీఆర్ మానసపుత్రిక లాంటి పథకం రైతు బీమా.. దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రధానమంత్రి కూడా కేంద్రంలో అమలుచేస్తున్నారు. పక్కరాష్ట్రం కూడా కాపీకొట్టింది. రైతు బీమా పథకంతో దేశ అన్నదాతల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం కొండంత అండగా నిలిచినట్టు అయింది. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి.. అన్నదే సీఎం కేసీఆర్ సూత్రం. రాష్ట్రంలో ఒకరు, కేంద్రంలో ఒకరు అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అనుకున్నది సాధించేవరకు సీఎం కేసీఆర్ వదిలిపెట్టరు” అని కేటీఆర్ అన్నారు.